Wednesday, May 15, 2024

కొండా లక్ష్మణ్ బాపూజీ కాంస్య విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఉమ్మడి మహబూబ్ న‌గర్ జిల్లా బ్యూరో ప్రభ న్యూస్ – రాష్ట్రం కోసం తన మంత్రి పదవిని త్యజించిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ధవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో ఉన్న గ్రీన్ బెల్టులో కొండా లక్ష్మణ్ బాపూజీ నూతన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకు తన పదవిని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. సహకార చట్టంలో అనేక మార్పులను తీసుకువచ్చి సహకార సంఘాల ద్వారా బడుగు, బలహీన వర్గాల బలోపేతానికి కొండా లక్ష్మణ్ బాపూజీ కృషి చేశారని, తెలంగాణ వచ్చేవరకు తాను ఎలాంటి పదవులను చేపట్టబోనని ప్రతిజ్ఞ చేశారని ,అమరవీరుల సాక్షిగా కొండా లక్ష్మణ్ బాపూజీ ఇంట్లో సమావేశం ఏర్పాటు చేయగవప్పటి ప్రభుత్వం తన సామాన్లన్నీ బయటపడేసినప్పటికీ 90 సంవత్సరాల వయసులో సైతం ఆయన ఎలాంటి భయం లేకుండా రాష్ట్రం కోసం పోరాడారని దాన్ని గుర్తించి రాష్ట్ర ముఖ్యమంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ ఇల్లు ఉన్న చోట అమరవీరుల స్థూపం ఏర్పాటు చేస్తామని ప్రకటించడం జరిగింది అని ఆయన తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు భాగంగా కొండా లక్ష్మణ్ బాపూజీని స్మరించుకోవడం ఎంతో సంతోషమని, ఆయనకు నివాళులర్పిస్తూ కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్రను పాఠ్యాంశాలుగా ఏర్పాటు చేస్తామని, త్యాగాలకు మరో పేరైన ఆయన గురించి అందరికీ తెలియజేస్తామని తెలిపారు. తెలంగాణ కోసం పోరాడిన మహనీయులు తమ ప్రభుత్వం ఎల్లప్పుడు విలువ ఇస్తుందని తెలిపారు. పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ లో ఇప్పటికే ఉన్న విగ్రహాలతో పాటు, చాకలి ఐలమ్మ, మల్లమాంబ, ఏకలవ్యుడు, వాల్మీకి, పండుగ సాయన్న, సర్దార్ సర్వాయి పాపన్న, దొడ్డి కొమరయ్య తదితర వీరుల విగ్రహాలను ఏర్పాటు చేస్తామన్నారు. హైదరాబాదులో కొండా లక్ష్మణ్ బాపూజీ ఆత్మగౌరవ భవనంతో పాటు ,విగ్రహాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.

జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్, ఎస్పీ కే. నరసింహ, మున్సిపల్ చైర్మన్ కే.సీ నరసింహులు, ముడా చైర్మన్ రంజీ వెంకన్న ,పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు ప్రభాకర్ రావు, బాలాజీ, వెంకటేష్, భీంపల్లి శ్రీకాంత్,, కౌన్సిలర్లు తిరుమల వెంకటేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు .
అనంతరం మంత్రి పక్కనే ఏర్పాటుచేసిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement