Thursday, May 2, 2024

TS – ఖ‌మ్మం నుంచి నామా… మ‌హ‌బూబాబాద్ నుంచి క‌విత మరోసారి పోటీ..

హైదరాబాద్‌: వచ్చే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం, మహబూబాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాల నేతలతో భారాస అధినేత కేసీఆర్‌ సమీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వ‌చ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామా నాగేశ్వరరావు, మాలోతు కవితకు మరోసారి అవకాశం కల్పించారు. ఇప్ప‌టికే ఖమ్మం, మహబూబాబాద్‌ స్థానాలకు ఎంపిగా ఉన్న ఆ ఇద్ద‌రు తిరిగి అదే స్థానాల నుంచి రంగంలోకి దిగ‌నున్నారు..

వాళ్లలో వాళ్లే కొట్టుకుంటారు..

 సోమవారం తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన ఖమ్మం, మహబూబాబాద్‌ పార్లమెంట్‌ ముఖ్యనేతల భేటీ జరిగింది. ఈ భేటీలో కేసీఆర్‌ స్వయంగా ఈ పేర్లను ప్రకటించారు. ”వచ్చే ఎన్నికల్లో ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ మనమే గెలుస్తున్నాం. ప్రభుత్వానికి ప్రతిపక్షం రుచి చూపిస్తాం. ఎవరూ అధైర్య పడొద్దు. కేడర్ కలిసికట్టుగా వచ్చే ఎన్నికల్లో పని చేయాలి..

..దళితబంధు ఎన్నికల కోసం తేలేదు. ఒక విజన్ కోసం తెచ్చాను. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. పార్టీని వీడి వెళ్ళే నేతలతో మనకు ఏం నష్టం లేదు. ఎన్టీఆర్‌కే రాజకీయాల్లో ఒడిదుడుకులు తప్పలేదు. మనమెంత!. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీగా ఉన్న టీడీపీ ఘోరంగా ఒడిపోయింది. తిరిగి మళ్లీ పుంజుకుంది. రాజకీయాల్లో ఒడిదుడుకులు వస్తాయి తట్టుకోవాలి. మనకు గ్రౌండ్ లో పరిస్థితి అనుకూలంగా ఉంది. నేతలు కలిసికట్టుగా పార్టీ అభ్యర్థులను గెలిపించాలి. ప్రభుత్వానికి పాలనపై అవగాహన రావటం లేదు. ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైంది..

.. మనం ప్రజలకు చేయాల్సింది చేశాం. అయినా ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు. ప్రజలకు మన విలువ తెలుస్తుంది. రాబోయే రోజులు మనవే. ప్రభుత్వానికి పై వ్యతిరేకత అంశాలు మనం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే మనకు ఎజెండా ఇస్తుంది. వచ్చే రోజుల్లో వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటారు. కరీంనగర్ సభ తర్వాత ఖమ్మం లో మరో బహిరంగ సభ ఏర్పాటు చేద్దాం. ఒక్కో నియోజక వర్గానికి ముగ్గురు సమన్వయకర్తలు నియమించుకుందాం” అని ఆ సమీక్షలో కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

- Advertisement -

ఇక.. ఖమ్మం,మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల ఎన్నికల ఇంచార్జ్ గా పల్లా రాజేశ్వర్ రెడ్డి,వద్దిరాజు రవిచంద్ర,బండి పార్థసారథి రెడ్డిలను నియమిస్తున్నట్లు తెలిపారాయన.

Advertisement

తాజా వార్తలు

Advertisement