Sunday, October 6, 2024

కేసీఆర్‌ ప్రసంగాలే ప్రేరణ.. విప్‌ గొంగిడి సునీత

ఇష్టం లేకుండా రాజకీయాల్లోకి వచ్చాను
ముఖ్యమంత్రి ఆదరణ మరువలేనిది
ఈ ప్రాంత ప్రజలు ఆశీర్వదించారు
ఇంకా కొన్ని చేయాల్సినవి ఉన్నాయి
డీసీసీబీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి నుంచి ఎంతో నేర్చుకున్నాను
ఆంధ్రప్రభతో ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత

ఒక ప్రైవేట్‌ సంస్థలో ఉద్యోగినిగా పనిచేసుకుంటున్న ఆమె.. అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల రంగు, రుచులకు దూరంగా ఉండే ఆ మహిళ తప్పనిసరి పరిస్థితుల్లో భర్త మాట కాదనలేక ఈ కేళిలో అడుగుపెట్టారు. తన మాటతీరు, వ్యవహారశైలితో ప్రజలకు చేరువయ్యారు. ఎంపీటీసీ.. ఎంపీపీగా విజయం సాధించారు. ఒక మహిళగా తను చేయాల్సింది చేసుకుంటూ తన మండల సమస్యలపై దృష్టిసారిస్తూ.. పరిష్కరిస్తూ.. ప్రజలతో మమేకమయ్యారు. తన మహేంద్రుడు ఎల్లవేళలా స్ఫూర్తిగా నిలిచారని, ఈ ఒదుగుదల, ఎదుగుదలకు కేసీఆర్‌ ప్రసంగాలే తనకు ప్రేరణగా నిలిచాయని ఆత్మవిశ్వాసంతో చెప్పారు ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత. ఆంధ్రప్రభతో ఆమె పలు విషయాలు పంచుకున్నారు.

(ప్రభన్యూస్‌, ఆలేరు/ యాదగిరి గుట్ట) : ఎలాగూ భర్త రాజకీయాల్లో కొనసాగుతున్నారని, తను ప్రైవేట్‌ సంస్థలో మేనేజర్‌ స్థాయి ఉద్యోగం చేసుకుంటూ హాయిగా గడిపేస్తున్నామని అనుకున్నారు ఎమ్మెల్యే సునీత. ఉమ్మడి రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలు ఆసక్తిగా గమనిస్తూనే తనపని చేసుకుంటూ పోతున్నారు. ఈ క్రమంలోనే వచ్చిన మండల ఎన్నికల ప్రకటన ప్రైవేటు ఉద్యోగిని సునీత జీవితాన్ని ఒక మలుపు తిప్పింది. పలు ఆటు పోట్లను ఎదుర్కొంటూ సాగిన రాజకీయ జీవితంలో కొన్ని విశేషాలను ఆంధ్రప్రభతో పంచుకున్నారు…
ప్రభన్యూస్‌ : నమస్తే మేడం.. ఎలా ఉన్నారు?
విప్‌ సునీత : అయామ్ ఫైన్‌.. అండీ
ప్రభన్యూస్‌ : ఎలా ఉంది మీ నియోజకవర్గం.
విప్‌ సునీత : ప్రశ్నలడుగుతారనుకుంటే.. విశేషాలు అడుతున్నారు?
ప్రభన్యూస్‌: మీరు ఎమ్మెల్యే కాకముందు.. తరువాత నియోజకవర్గం పరిస్థితి ఏమిటి?
విప్‌ సునీత : ఎమ్మెల్యే కాక ముందు కూడా ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా పనిచేశాను. అప్పటి నుంచే నాకు అవగాహన ఉంది. అది ఎమ్మెల్యే అయ్యాక సమస్యల పరిష్కారానికి బాగా దోహదపడింది. ఆలేరు నియోజకర్గం బాగా చైతన్యవంతమైన ప్రాంతం… ఆనాడు అనేక సమస్యలుండేవి. నేను ఎంపీపీగా చేసిన సమయంలోనే నియోకవర్గంపై ఒక ఆలోచన ఉండేది. అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. సంక్షేమం.. అభివృద్ధి ఎలా చూసినా స్పష్టంగా కనిపిస్తాయి. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఈ ఎనిమిదేళ్లలో రూ.3వేల కోట్లకు పైగా వెచ్చించాం.


ప్రభన్యూస్‌ : రాజకీయాల్లోకి ఎలా ప్రవేశించారు ?
విప్‌ సునీత : రాజకీయాలంటే నాకు పెద్దగా ఇంట్రెస్టు లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో జరిగింది. అప్పటికే నేను ఒక ప్రైవేట్‌ కంపెనీలో మంచి పొజిషన్‌లో ఉన్నాను. ఈలోగా మండల ఎన్నికలు వచ్చాయి. అప్పటిదాకా జనరల్‌గా ఉన్న గుట్ట ఎంపీపీ స్థానం జనరల్‌ మహిళకు రిజర్వైంది. మా సారుకు పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో నేను పోటీ చేయడం తప్పనిసరైంది. అలా ప్రవేశించి.. ఎంపీపీనయ్యాను.(2001-06) ఈ సమయంలోనే మండల సమస్యలపై అవగాహన పెరిగింది. తెలంగాణ ఉద్యమం.. పెరుగుతున్న ఉధృతి.. కేసీఆర్‌ ప్రసంగాలు నాలో ఆలోచనను మరింత రేకెత్తించాయి.. ఆ తరువాత మా అడుగులు టీఆర్‌ఎస్‌ వైపు పడ్డాయి. ఈ లోపు ఎమ్మెల్యే ఎన్నికలు జరిగాయి.. ఎస్సీ రిజర్వుడు కాబట్టి ఇక్కడి నుంచి పోటీచేసిన అభ్యర్థికి మద్దతునిచ్చి… గెలిపించుకున్నాం..
ప్రభన్యూస్‌ : ఆ తరువాత ?
విప్‌ సునీత : 2006లో జెడ్‌పీటీసీగా అవకాశం వచ్చింది. నేను టీఆర్‌ఎస్‌ నుంచి పోటీచేస్తే గెలిచే అవకాశం ఉందని సర్వేలు చెప్పాయి. అధిష్టానం ఓకే అంది. అయితే ఎమ్మెల్యే ససేమిరా అన్నారు. మధ్యవర్తులు కూడా టికెట్‌ విషయంలో ఏమీ చేయలేకపోయారు కానీ… నైతికంగా మద్దతు పలికారు. దీంతో ఇండిపెండెంట్‌గా పోటీచేశాను… ఓడిపోయినా… ప్రజల నుంచి మంచి మద్దతు లభించింది.


ప్రభన్యూస్‌ : ఆ ఓటమి తరువాత ?
విప్‌ సునీత : చాలా అనుభవాలు పాఠాలయ్యాయి. బాధపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ మహేంద్రుడు నింపిన ఆత్మస్థైర్యంతో రాజకీయాల్లోనే కొనసాగాలనుకున్నాను. 2006లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మా గ్రామ ప్రజలంతా నన్ను పోటీచేయాలని ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో వంగపల్లి సర్పంచ్‌గా పోటీ చేసి గెలిచాను. అక్కడందించిన సేవలతో స్వగ్రామం రుణం కొంత తీర్చుకున్నట్టయింది.
ప్రభన్యూస్‌ : మరి ఎమ్మెల్యేగా ప్రవేశం ఎలా జరిగింది.
విప్‌ సునీత : 2008లో బై ఎలక్షన్‌ వరకు ఆలేరు స్థానం ఎస్సీలకు ఉండేది. 2009 సాధారణ ఎన్నికలకు ఇది జనరల్‌ అయింది. ఈ విషయంపై జెడ్పీటీసీ ఎన్నికల సమయంలోనే మాకు సమాచారం ఉంది. ఎంపీపీగా, సర్పంచ్‌గా పనిచేసిన అనుభవం ఉండటంతో సీటు కావాలని అధిష్టానాన్ని కోరాం. సర్వేలన్నీ టీఆర్‌ఎస్‌కు అనుకూలంగానే ఉన్నాయి. సీటు ఇస్తరనే నమ్మకం కూడా ఏర్పడింది. కానీ చివరి నిమిషంలో కళ్లెం యాదగిరిరెడ్డికి సీటు రావడంతో అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి పనిచేశాం. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి విజయం సాధించారు. ఒకవైపు తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటూ పనిచేశాం.. 2 జూన్‌ 2014లో తెలంగాణ అవతరణ.. ఆ తరువాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసేందుకు పార్టీ అధిష్టానం నన్ను అభ్యర్థిగా నిర్ణయించడం… నేను విజయం సాధించడం జరిగిపోయాయి.

- Advertisement -


ప్రభన్యూస్‌ : రెండో సారి అంటే.. 2018లో మీ విజయం నల్లేరుమీద నడకలా సాగిందా..?
విప్‌ సునీత : నేను మొదటి ఎన్నికల్లో నా అనుభవంతో నేను గమనించిన సమస్యలను ప్రచారం చేశాను. చెరువులను బాగు చేయిస్తానని.. భూగర్భ జలాలు పెంచే ప్రయత్నం చేస్తానని చెప్పాను.. అదృష్టం కొద్దీ… సీఎం కేసీఆర్‌ మిషన్‌ కాకతీయ తీసుకొచ్చారు. దీంతో నియోకవర్గంలో 500లకు పైగా చెరువులు బాగుపడ్డాయి. ఆ తరువాత ఎప్పుడు వర్షాలు పడినా.. చెరువులన్నీ నిండుకుండలను తలపిస్తాయి. ఇంకా ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు నాకు వరమయ్యాయి. వాటిని పేదలకు చేర్చడంలో నేను విజయం సాధించాను. 2018 ఎన్నికల్లోనూ సాగు నీటి కోసం కృషి చేస్తానని చెప్పాను. ముఖ్యమంత్రి బృహత్తరంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో అది సాధ్యమైంది. అన్నింటికి మించి.. సీఎం ఆశీసులు… అండదండలు నాకు కలిసొచ్చాయి… దీంతో రెండో సారి విజయం సాధించాను.

Advertisement

తాజా వార్తలు

Advertisement