Sunday, April 28, 2024

KCR – 95 నుంచి 100 స్థానాల‌లో గెలుపు ప‌క్కా….గ‌జ్వేల్ మ‌రింత అభివృద్ధి చేస్తా….

మేడ్చల్‌: త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భారాస హ్యాట్రిక్‌ విజయం సాధించి అధికారంలోకి వస్తుందని సీఎం కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం తూంకుంటలో కన్వెన్షన్‌హాలులో గజ్వేల్‌ నియోజకవర్గ భారాస నేతలతో కేసీఆర్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 95 నుంచి 100 అసెంబ్లీ స్థానాలు గెలవనున్నామని పార్టీ శ్రేణులకు చెప్పారు. రాష్ట్రానికే తలమానికంగా గజ్వేల్‌ను తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ఇకపై ప్రతి నెలలో ఒకరోజు గజ్వేల్‌ నియోజకవర్గానికి కేటాయిస్తానని అన్నారు. గజ్వేల్‌ నియోజకవర్గంలో ఒక్క నిరుపేద కూడా ఉండొద్దన్నదే తన లక్ష్యమని స్పష్టం చేశారు. గజ్వేలులో జరిగిన అభివృద్ధితో సంతృప్తి పడొద్దని చేయాల్సింది ఇంకా చాలా ఉందన్నారు. ఒక విడత మాత్రమే అభివృద్ధి పనులు జరిగాయి.. గజ్వేలులో రెండో విడతలో మరింత అభివృద్ధి పనులు జరుగుతాయని పేర్కొన్నారు. గజ్వేల్‌ను వదిలిపెట్టి పోయేది లేదన్నారు. తనను ఎంత మెజార్టీతో గెలిపిస్తారనేది ప్రజల దయ అన్నారు. కామారెడ్డిలో పోటీ చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయని పార్టీ నేతలకు వివరించారు.

”గతంలో తెంగాణ నేతలకు టికెట్లు కేటాయించేటప్పుడు దారుణమైన పరిస్థితులు ఉండేవి. పార్టీ టికెట్ల కోసం పోయిన నేతలను చులకనగా చూశారు. గతంలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా నీటిబిందెల ప్రదర్శన ఉండేది. ఇప్పుడు ఎక్కడైనా రోడ్లపై బిందెలు కనిపిస్తున్నాయా? చివరికి అవమానాలు దిగమింగి.. అనేక పోరాటాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. వలసపోయిన రైతులు మళ్లీ గ్రామాలకు రావాలనే లక్ష్యంతో పనిచేశాం. వ్యవసాయ స్థిరీకరణ జరిగితేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. సాగు ఖర్చుల కోసం రైతులకు డబ్బులు ఇవ్వాలనే ఆలోచన ఎవరికైనా వచ్చిందా? మిషన్‌ భగీరథకు స్ఫూర్తి సిద్దిపేటలో అమలు చేసిన తాగునీటి పథకమే” అని కేసీఆర్‌ వివరించారు. కేసీఆర్‌తో పాటు సమావేశంలో మంత్రి హరీశ్‌రావు, ఒంటేరు ప్రతాపరెడ్డి, రఘోత్తమ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement