Saturday, April 27, 2024

Peddapalli: మైనార్టీల సంక్షేమం బీఆర్ఎస్ తోనే సాధ్యం.. ఎమ్మెల్యే దాసరి

పెద్దపల్లి (ప్రభ న్యూస్) : ముస్లిం మైనార్టీల సంక్షేమం బీఆర్ఎస్ తోనే సాధ్యమని పెద్దపల్లి ఎమ్మెల్యే, బారాస అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి తెలియజేశారు. మంగళవారం మిలాద్ కమిటీ అధ్యక్షుడు ఎంఏ సాబీర్ తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరారు. పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం మాట్లాడుతూ… కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. షాదీ ముబారక్ తో నిరుపేద ఆడపిల్లల వివాహానికి చేయూతనందిస్తున్నారన్నారు. మైనార్టీ పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందిస్తున్నారన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ 50ఏళ్లు పరిపాలించినా ముస్లింలను ఓటు బ్యాంకు గానే చూసారని వారి సంక్షేమం కోసం కృషి చేయలేదన్నారు.

బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి మైనార్టీల సంక్షేమం కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నారన్నారు. ముస్లిం మైనారిటీలతో 40ఏళ్లుగా సత్సంబంధాలు ఉన్నాయన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని, 30న జరిగే పోలింగ్ లో కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి మద్దతు ఇవ్వాలని కోరారు. బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి రాగానే తెల్ల రేషన్ కార్డు గల ప్రతి ఒక్కరికీ సన్న బియ్యం అందించడంతో పాటు ఐదు లక్షల రూపాయల బీమా సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు. నియోజకవర్గంలో 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు 3000 రూపాయలు అందుతాయన్నారు. 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని, ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితిని 15 లక్షల రూపాయలకు పెంచుతామన్నారు. రైతుబంధు రూ.16వేలకు, ఆసరా పింఛన్లను ఐదువేలకు, వికలాంగుల పింఛన్లను ఆరువేలకు పెంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సి.సత్యనారాయణ రెడ్డి, వేముల రామ్మూర్తి, తబ్రెజ్ ఖాన్, మోబిన్, రఫీ ఖాన్ మునీర్, ముజీబ్, షరీఫ్, అతీఖ్, మొకీమ్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement