Tuesday, April 30, 2024

TS : దేవుడితో రాజకీయాలు చేసేది మీరే… ఎంపీ బండి సంజయ్

చొప్పదండి, ప్ర‌భ‌న్యూస్ః దేశం, ధర్మం గురించి మాట్లాడితే నాకేం పనిలేదని నోటి దురద ఉన్న కాంగ్రెస్ నాయకులు త‌న‌ను కించపర్చేలా మాట్లాడుతున్నారని కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. బుధవారం కరీంనగర్ జిల్లా చొప్పదండిలో పలు పార్టీల నాయకులు భాజపా లో చేరగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

- Advertisement -

అనంతరం మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఎక్కడికిపోయినా దేవుడి మీద ఒట్టేసి హామీలను అమలు చేస్తానంటున్నాడని గద్వాల పోయి జోగులాంబ అమ్మవారి మీద ఒట్టేడు, యాదాద్రి పోయి లక్ష్మీ నర్సింహస్వామి మీద ఒట్టేస్తరు, వరంగల్ పోయి భద్రకాళి అమ్మవారి మీద ఒట్టేస్తరు, వాళ్లు మాట్లాడితే కరెక్టట నేను మాట్లాడితే తప్పంటున్నారన్నారు. ఇదేం న్యాయం నేను వాళ్లలా దేవుడిపై ఒట్టేసి హామీలు అమలు చేయకుండా మోసం చేయడం లేదన్నారు. దేశం కోసం, ధర్మ రక్షణ కోసం పోరాడుతుమన్నారు. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అభ్యర్ధి ఎవరో కూడా నేటికీ తేల్చుకోదని, అలాంటి నాయకులు తనను ఓడిస్తానని బీరాలు పలుకుతుంటే నవ్వొస్తుందన్నారు. ఇక్కడున్నాయన పార్టీకి, సీఎంకు చెప్పకుండా వెలిచాల రాజేందర్ ను తీసుకుపోయి నామినేషన్ వేయించాడని, ఈ విషయం తెలిసి సీఎం, హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు.

ఇయాళ పోటీగా అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి కూడా నామినేషన్ వేస్తున్నారని, రేపే నామినేషన్లకు ఆఖరు తేదీ అయినప్పటికీ అభ్యర్ధి ఎవరో కూడా తేల్చుకోలేక పోతుండడం సిగ్గుచేటన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను నమ్మి ఓటేసి ప్రజలు మోసపోయారన్నారు. నరేంద్రమోదీ హామీలివ్వకుండా అధికారంలోకి వచ్చినా ప్రజలకు అవసరమైనవన్నీ చేస్తున్నాడన్నారు. మోదీ చేసిందే చెబుతారని,చెప్పిందే చేస్తారన్నారు. ఆగస్టు 15న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి మరో డ్రామాకు తెర లేపారన్నారు. డిసెంబర్ 9వ తేదీన రుణమాఫీ చేస్తామన్న ముఖ్యమంత్రి ఎన్నికల్లోపే ఎందుకు చేయలేదన్నారు. పోనీ ఎన్నికల కోడ్ అయిపోగానే జూన్ 4న రుణమాఫీ చేయొచ్చు కదా ఆగస్టు 15 వరకు ఎందుకు అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ హామీలివ్వకపోతే అవి నెరవేర్చేదాకా కొట్లాడే ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే అన్నారు. బోనస్ ఇచ్చేదాకా వెంటాడతామని, తాలు, తరుగు, తేమతో పని లేకుండా వడ్లు కొనాలంటే రూ.700 కోట్లు మాత్రమే ఖర్చు అవుతాయన్నారు. కేసీఆర్ సర్కార్ మోసాలను ఎండగట్టి ఫాంహౌజ్ లో పడుకున్నోడిని ధర్నా చౌక్ కు గుంజుకొచ్చాననే అక్కసుతో నన్ను ఓడగొట్టాలని కుట్ర చేస్తున్నాడన్నారు.

అదే విధంగా 6 గ్యారంటీలను ఎందుకు అమలు చేయడం లేదని కాంగ్రెస్ ను నిలదీస్తుంటే తనను ఓడించాలని బీఆర్ఎస్ తో కలిసి ఇక్కడున్న కాంగ్రెస్ నేతలు కుట్ర చేస్తున్నారన్నారు. మహిళలకు ప్రతినెల 2500 రూపాయలు ఇస్తామన్నారని, వ్రుద్దులు, వితంతవులు, బీడీ కార్మికులకు పెన్షన్ ను 4 వేలకు పెంచి నెలనెలా ఇస్తామని ప్రచారం చేసి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడిచిపోయిన ఎందుకు ఇవ్వడం లేదన్నారు. ఇండ్లు లేని వాళ్లందరికీ ఇంటి జాగాతోపాటు 5 లక్షల సాయమందిస్తామని చెప్పి ఇంతవరకు ఒక్కరికైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. రైతులకు రైతు భరోసా కింద 15 వేల ఆర్దిక సాయం, రైతు కూలీలకు 12 వేల సాయమందిస్తామనీ చెప్పి మాట తప్పారన్నారు. రైతులు అల్లాడుతున్నా ఎందకు బోనస్ ఇవ్వలేదన్నారు. విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు ఇచ్చి చదువుపై భారం పడకుండా చూస్తామన్నారని, ఒక్కరంటే ఒక్క విద్యార్ధికైనా భరోసా కార్డు ఇవ్వలేదన్నారు. 57 ఏళ్ల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ కనీసం మరుగుదొడ్ల నిర్మాణం కూడా చేపట్టకుండా మహిళ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశారన్నారు. మోదీ ఇండ్ల కోసం నిధులిస్తే కేసీఆర్ దారి మళ్లించాడన్నారు. పంచాయతీలకు వేల కోట్ల నిధులిస్తే కేసీఆర్ దారి మళ్లించాడని, గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఉచితంగా బియ్యం ఇస్తుంటే కేసీఆర్ బొమ్మలు పెట్టుకున్నారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కేసీఆర్ రాచి రంపాన పెట్టిండన్నారు. మోదీని ప్రపంచ దేశాలన్నీ గౌరవిస్తుంటే ఇక్కడున్న మంత్రి అగౌరవంగా మాట్లాడుతున్నాడని రాబోయే రోజులు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు.
మే 13న జరిగే పార్లమెంటు ఎన్నికల్లో కమలం గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని 24 గంటలపాటు అందుబాటులో ఉండి సేవలందిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement