Wednesday, May 15, 2024

రహదారులపై బైటాయిస్తే కేసులు : సీఐ ప్రదీప్ కుమార్

రోడ్డు ప్రమాదాలు జరిగినపుడు ప్రమాదంలో గాయపడిన లేదా చనిపోయిన బాధిత కుటుంబ సభ్యులు, సన్నిహితులు రహదారులపై ధర్నాలు, రాస్తారోకో లు నిర్వహిస్తూ అత్యవసర పరిస్థితుల్లో వాహదారులకు, ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని వారిపై కేసులు నమోదు చేస్తామని పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్ హెచ్చరించారు. ఈ మధ్యకాలంలో బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుక్కల గూడూరు, పెద్దపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాద బాధితుల కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులు నష్టపరిహారం కోసం కొంతమంది స్వార్థం మరియు స్వలాభం పొందే వారి ప్రోద్బలంతో రోడ్లపైకి వచ్చి రాస్తారోకలు, ధర్నాలు చేయడం జరిగిందన్నారు. ఇలాంటి నిరసనల వలన సాధారణ ప్రజలకి వాహనదారులకి ఇబ్బంది కలుగుతుంది తప్ప సమస్యలు పరిష్కారం కావన్నారు. బాధితులకు ఏదైనా నష్టపరిహారం కావాలనుకుంటే చట్టపరంగా కోర్టుల ఆదేశాలు, నిర్ణయం ద్వారా పొందాలన్నారు. ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ మధ్యకాలంలో కొంతమంది ప్రతి విషయాన్ని వీడియోలు ఫోటోలు తీసి వైరల్ చేసి, పేరు సంపాదించాలనే దురుద్దేశంతో సంఘటనకు సంబంధించిన బాధితులను వారి కుటుంబ సభ్యులను ప్రోత్సహించి ధర్నాలు, రాస్తరోకలు చేయడం వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయని వారిని రోడ్లపై బైఠాయించే విధంగా ప్రేరేపిస్తున్నారన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడే కొంతమంది జాబితా సిద్ధం చేయడం జరిగిందని అటువంటి వారిపై త్వరలోనే చట్టమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అదే విధంగా వీరి మాటలు విని ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించే వారిపై కూడా చట్టపరమైన కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement