Tuesday, April 30, 2024

KNR: గంజాయి గ్యాంగ్‌లపై పోలీసుల ఉక్కు పాదం

గంజాయి అమ్మినా.. కొనుగోలు చేసినా.. కఠిన చర్యలు
ఐదగురు నిందుతుల అరెస్ట్‌, సుమారు 2 కిలోల సీజ్‌
వివరాలు వెల్లడించిన వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి

వేములవాడ, ఏప్రిల్‌ 13 (ప్రభన్యూస్‌): గంజాయి గ్యాంగ్‌లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గంజాయి సేవించినా, రవాణా చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి పేర్కొన్నారు. వేములవాడ రూరల్‌ సర్కిల్‌ కార్యాలయంలో గంజాయి నిందితులకు సంబంధించిన అరెస్ట్‌ వివరాలను ఆయన వెల్లడించారు. ఈసందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ… మంచిర్యాల జిల్లా అల్లూరి సీతారాంనగర్‌కు చెందిన, ప్రస్తుతం వేములవాడ పట్టణం శాస్త్రీనగర్‌లో నివాసముంటున్న పరిగిపండ్ల అన్వేష్‌ అలియాస్‌ బన్నీ, వేములవాడ పట్టణం సుభాష్‌ నగర్‌కి చెందిన మర్రిపల్లి సురేష్‌ అనే ఇద్దరు వ్యక్తులు శుక్రవారం సాయంత్రం సుమారు 3.30 గంటల సమయంలో వేములవాడ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని నాగాయపల్లి గ్రామం శివారులో రైతు వేదిక వెనుకాల ఇద్దరు వ్యక్తులు నిషేధిత గంజాయిని అమ్ముతున్నారన్న నమ్మదగిన సమాచారం మేరకు వేములవాడ రూరల్‌ ఎస్‌ఐ మారుతి తన సిబ్బందితో వెళ్లారన్నారు.

అక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తులు పోలీస్‌ వాహనాన్ని చూసి పారిపోయేందుకు ప్రయత్నంచగా వెంటేనే ఎస్‌ఐ తన సిబ్బందితో వారిని వెబడించి పట్టుకొని వారి వివరాలు సేకరించారన్నారు. అన్వేష్‌ చేతిలో ఉన్న బ్యాగ్‌ ఓపెన్‌ చేయగా టేప్‌తో చుట్టబడిన గంజాయి ప్యాకెట్‌ ఉందని, 1 కిలో 270 గ్రాముల గంజాయిని సీజ్‌ చేసి వారిని అదుపులోకి తీసుకున్నామన్నారు. అలాగే గతంలో గంజాయి వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్‌లో ఐస్‌ క్రీమ్‌ బండి నడిపే శ్యామ్‌ దివాకర్‌, కుమ్మరి మల్లికార్జున్‌, భానుల వద్ద కొనుగోలు చేసి గంజాయి తాగడానికి అలవాటు- పడ్డారన్నారు. వారి దగ్గర గంజాయి కొని అమ్మగా వచ్చే డబ్బులతో జల్సాగా జీవించవచ్చనే ఉద్దేశంతో గంజాయి తాగుడుకు అలవాటు పడిన వేములవాడలోని సుభాష్‌నగర్‌కి చెందిన భూమేష్‌, అంబేడ్కర్‌ నగర్‌కి చెందిన సచిన్‌, అగ్రహారంకి చెందిన సాయిలకు అమ్మేవారన్నారు.

వీరిలో శ్యామ్‌ దివాకర్‌ (యూపీ), మల్లికార్జున్‌ (వేములవాడ), కట్కూరి భాను (కామారెడ్డి)లను వేములవాడ పట్టణంలోని అయ్యప్ప గుడి సమీపంలో పట్టుకున్నారని తెలిపారు. వీరి వద్ద నుంచి 620 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. భూమేష్‌, సచిన్‌, సాయిలు పరారీలో ఉన్నారని, వారిని త్వరలో పట్టు-కుంటామని డీఎస్పీ తెలిపారు. వేములవాడ రూరల్‌, టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో కలిపి సుమారు 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. జిల్లాలో గంజాయి నిర్మూలనకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని, గంజాయి నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. గంజాయి కొన్నా, సేవించినా, రవాణా చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు. జిల్లాలో గంజాయికి సంబంధించిన సమాచారం సబంధిత పోలీస్‌ వారికి లేదా, డయల్‌ 100కి అందించాలని, వివరాలు గోప్యంగా ఉంచుతామని డీఎస్పీ స్పష్టం చేశారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న కానిస్టేబుళ్లు రాజశేఖర్‌, తిరుపతి, శంకర్‌, గోపాల్‌, సతీష్‌లకు డీఎస్పీ రివార్డులు అందజేసి అభినందించారు. ఈ సమావేశంలో రూరల్‌, పట్టణ ఇన్‌చార్జి సీఐ శ్రీనివాస్‌, రూరల్‌ ఎస్‌ఐ మారుతీ, టౌన్‌ ఎస్‌ఐ అంజయ్య, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement