Tuesday, May 14, 2024

Peddapalli: నిరుపేదలకు అండగా బీఆర్ఎస్.. ఎమ్మెల్యే దాసరి

నిరుపేదలకు భారత రాష్ట్ర సమితి అండగా ఉంటుందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తెలియజేశారు. ఇవాళ సుల్తానాబాద్ మండలం మంచిర్యాలలో గడపగడపకు ప్రచారంలో పాల్గొని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని వివరించి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. అనంతరం మాట్లాడుతూ… ప్రపంచంలో ఎక్కడా లేని పథకాలను సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేసి పేదల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, రైతు బీమా, దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు, కేసీఆర్ కిట్టు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అల్పాహారం లాంటి పథకాలు ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయా ప్రజలు తెలుసుకోవాలన్నారు.

అధికారం కోసం దొంగ హామీలు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీని నమ్మవద్దని, నమ్మి మొండి చేయికి ఓటు వేస్తే తిరిగి కష్టాలు మొదలవుతాయన్నారు. నియోజకవర్గంలో గత పాలకులు అభివృద్ధిని పట్టించుకోలేదని గత తొమ్మిదిన్నరేళ్లలో 40ఏళ్లలో జరగని అభివృద్ధి చేసి చూపామన్నారు. బీఆర్ఎస్ కు ఓటు వేస్తే మూడు పంటలు పండుతాయని, కాంగ్రెస్ కు ఓటు వేస్తే మూడు గంటల కరెంటు మాత్రమే వస్తుందన్నారు. రాష్ట్రంలో మూడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ప్రచారంలో ఎమ్మెల్యే వెంట భారత రాష్ట్ర సమితి ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే దాసరికి మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement