Thursday, May 2, 2024

లండన్ నుండి వచ్చిన ట్రస్మా, నీసా సభ్యులకు ఘన స్వాగతం

లండన్ నుండి వచ్చిన ట్రస్మా, నీసా సభ్యులకు ఘన స్వాగతం లభించింది. ప్రైవేట్ విద్యా వ్యవస్థలో నూతన ఉరవడిని సృష్టించే కార్యక్రమంలో భాగంగా ఈనెల మొదటి వారంలో లండన్ లోని కేంబ్రిడ్జ్ అండ్ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయాలను సందర్శించి విద్యా సదస్సులో పాల్గొన్న నీసా అధ్యక్షుడు కులుభూషణ్ శర్మ ఆధ్వర్యంలోని 22 మంది భారత బృందంలో మన తెలంగాణ విద్యావేత్తలుగా తమ వాణి వినిపించిన డాక్టర్ ఈ ప్రసాదరావు, డాక్టర్ జే ఎస్ పరంజ్యోతి, కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి లు మన రాష్ట్రానికి తిరిగివచ్చారు. ఈసందర్భంగా వారికి హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది.


స్వాగత సత్కారాల అనంతరం కరీంనగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన సమావేశంలో లండన్ వెళ్లి వచ్చిన విద్యావేత్తలు మాట్లాడుతూ… ప్రథమంగా 31 కాలేజీలతో 35 వేల మందిపైగా దేశ విదేశ విద్యార్థులతో పెద్ద నగరమంత లండన్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ సందర్శించడం చాలా ఆనందంగా ఉందని, నేటివరకు మొత్తం ప్రకటింపబడిన నోబెల్ ప్రైజ్ లలో 13.5 శాతంపైగా కేంబ్రిడ్జ్ ప్రొఫెసర్లకు ప్రధానం చేయబడ్డాయని, అక్కడ ఉన్న ఉత్తమమైన విద్యా వాతావరణానికి నిదర్శనమని, అందులో భాగమైన ఫిట్జ్ విలియం కాలేజ్ లో భారత ప్రముఖులైన నేతాజీ సుభాష్ చంద్రబోస్, శంకర్ దయాల్ శర్మ, విజయ్ బాబా, ఎంఎస్ స్వామినాథన్, అమర్త్యసేన్ వంటి మహానుభావులు విద్యనభ్యసించిన ఈ కాలేజీలో వర్క్ షాప్, కాన్ఫరెన్స్ కు హాజరు కావడం గర్వంగా ఉందని డాక్టర్ ప్రసాద్ రావు అన్నారు.

జూలై 2వ తారీఖు నుండి 9వరకు, వారం రోజుల పాటు జరిగిన ఈ సమావేశాలలో దేశ, తెలంగాణ ప్రైవేటు విద్యావ్యవస్థలలో మార్పులను తీసుకురావడానికి, అంతర్జాతీయ విద్యా ప్రమాణాలను మన విద్యాసంస్థలలో పెంపొందించడానికి అదేవిధంగా నీసా- కేంబ్రిడ్జ్ విద్యా భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసే విధంగా ఫలప్రదమైన చర్చలు జరిగినట్లు అదేవిధంగా డాక్టర్ పరంజ్యోతి వన్ వీక్ ప్రోగ్రాం ఇన్ ఎడ్యుకేషన్ సందేశం అందర్నీ ఆకట్టుకున్నదని ఆయన తెలియజేశారు. అనంతరం 22 మంది సభ్యుల బృందం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో న్యూటన్ విద్యను అభ్యసించిన ట్రినిటీ కాలేజ్ ను సందర్శించటం, అక్కడ ఆల్బర్ట్ ఐన్స్టీన్ థియరీ బోర్డును చూడటం గర్వంగా ఉందని సభ్యులు తెలియజేశారు.

- Advertisement -

అక్కడి పద్ధతులను పైలెట్ ప్రాజెక్టుగా భారతదేశంలోని కొన్ని విద్యాసంస్థల్లో చర్చలు అనంతరం ప్రవేశపెట్టనున్నట్లు ట్రస్మా, నీసా ప్రతినిధులు తెలియజేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావుతో పాటు ట్రస్మా సంఘం రాష్ట్ర సలహాదారులు సౌగాని కొమరయ్య కరీంనగర్ పట్టణ అధ్యక్షులు శ్రీనివాసరావు, జిల్లా సలహాదారులు బి.రమణ రావు, పట్టణ సలహాదారులు జగన్మోహన్రావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement