Tuesday, May 28, 2024

INDEPENDENS DAY : బస్ భవన్ లో బాజిరెడ్డి జాతీయ పతాకావిష్కరణ..

నిజామాబాద్ రూరల్, ఆగస్టు 15 ప్రభ న్యూస్ : ఆర్టీసీ బస్ భవన్ ప్రధాన కార్యాలయంలో
మంగళవారం 77వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని టీఎస్ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సంస్థ ఎండి వీసీ సజ్జనార్ తో, సంస్థ ఉద్యోగులందరితో కలిసి త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించి, జెండా వందనాన్ని స్వీకరించారు. టీఎస్ ఆర్టీసీ పోలీసు సిబ్బంది వారు కవాతును నిర్వహించారు. పోలీసు సిబ్బంది వారి గౌరవ వందనాన్ని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ స్వీకరించారు.
ముందుగా శతకోటికి పైగా భారతీయులగుండెల్లో రెపరెపలాడే జాతీయజెండాకు వందనాలు తెలిపారు. ఈ సందర్భంగా పేరుపేరునా సంస్థ ఉద్యోగులందరికీ 77వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.


ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆశీస్సులతో టీఎస్ ఆర్టీసీ సంస్థను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసిన శుభ సందర్భంగా యావత్ సంస్థ ఉద్యోగులందరికీ హృదయపూర్వక శుభకాంక్షలు తెలియజేశారు. ఈ సమయంలో టీఎస్ఆర్టీసీ సంస్థ చైర్మన్ గా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. మన సంస్థ ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ సీఎం కేసీఆర్ సహకారంతో సంస్థ ఉద్యోగులకు 07 పెండింగ్ డీఏలను చెల్లించడం జరిగిందని చెప్పారు. సంస్థలో ప్రయాణికులకు అనుగుణంగా అధునాతన సౌకర్యాలు, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని చెప్పారు. ప్రస్తుతం కాలానికి అనుగుణంగా ప్రయాణికుల భద్రత కోసం సీసీ కెమెరాలు, వెహికల్ లొకేషన్, ట్రాకింగ్ సిస్టమ్, ఫైర్ డిటెన్షన్, అలారం, అడ్వాన్స్ టెక్నాలజీతో కూడిన ఎలక్ట్రానిక్, సూపర్ లగ్జరీ, స్లీపర్ క్లాస్ బస్సులను లాంఛనంగా ప్రారంభించుకొన్నామన్నారు. తిరుపతికి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే భక్తుల కోసం తిరుమల శ్రీవారి దర్శనానికై ప్రతిరోజూ 400 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు బుక్ చేసుకునే సౌలభ్యం ఉందన్నారు.

టీఎస్ఆర్టీసీ తార్నాక హాస్పిటల్ ను ఆధునీకరించుకొని కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉద్యోగులకు అందించడం గర్వంగా ఉందని చెప్పారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ భావోద్వేగానికి లోనై మాట్లాడారు. ఆర్టీసీ సంస్థలో ఇది చివరి కార్యక్రమమని, అధికారులతో ఉద్యోగులతో ఉన్న అనుబంధాన్ని సభా ముఖంగా పంచుకున్నారు. సంస్థలో ఎండి సజ్జానార్, తాను జోడి ఎడ్ల వలే కలిసి సంస్థ కోసం కృషి చేశామని చెప్పారు. టీఎస్ ఆర్టీసీ సంస్థను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసే సమయంలో తాను చైర్మన్ గా ఉండడం చాలా సంతోషకరమని, దీన్ని అదృష్టంగా భావిస్తున్నానని, ఇది తనకు తృప్తిగా ఉందని, తాను జీవితంలో మర్చిపోలేని విజయమని చెప్పారు. అధికారులు ఈడీలు, రీజనల్ మేనేజర్లు, డిపో మేనేజర్లు వివిధ విభాగాల్లో పనిచేసే అధికారులు సిబ్బంది ఎంతగానో కష్టపడి పనిచేస్తున్నారని చెప్పారు. మనందరి కృషి వల్లనే సంస్థకు నేడు మంచి రోజులు వచ్చాయని ఆశా భావాన్ని వ్యక్తం చేశారు.

- Advertisement -


పురపాలక, ఐటి శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి కేటీఆర్, హరీష్ రావు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కవితమ్మల తో చర్చించి వారి సహాయ సహకారాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆర్టీసీ సంస్థ ఉద్యోగులు పడుతున్న కష్టాలను, బాధలను విన్నవించానని, దానికి ఫలితంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారని చెప్పారు. మన టీఎస్ ఆర్టీసీ సంస్థ దేశంలోనే అత్యంత పేరు ప్రఖ్యాతలు సాధిస్తుందని, సంస్థ మరింత ముందుకు వెళుతుందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. టీఎస్ ఆర్టీసీ సంస్థ ఉద్యోగులందరూ సమిష్టిగా కృషిచేసి, నమ్మకంగా పనిచేస్తూ, సంస్థకు పూర్వ వైభవాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు. టీఎస్ ఆర్టీసీ సంస్థ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన శుభ సందర్భంగా మరోసారి వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ వైస్ చైర్మన్, ఎండీ వీసీ సజ్జనార్, ఈడీ మునిశేఖర్ ఈడీఏ కృష్ణ కాంత్, జాయింట్ డైరెక్టర్ సంగ్రామ్ సింగ్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement