Friday, May 3, 2024

MDK: స్వర్ణప్రాషన్ తో రోగనిరోధక శక్తి పెంపు.. మంత్రి హరీష్ రావు

సిద్ధిపేట ప్రతినిధి, ఆగస్టు 15 (ప్రభన్యూస్) : స్వర్ణప్రాషన్ ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుందని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రభుత్వ మల్టీ పర్పస్ హైస్కూలులో ఆరోగ్య శాఖ ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో కండ్లకలక నివారణ మందుతో పాటు రోగ నిరోధక శక్తిని పెంపొందించే స్వర్ణప్రాషన్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా జడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, ఆయుష్ కమీషనర్ హరిచందన, హరే రామ హరే కృష్ణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ… స్వర్ణప్రాషన్ ద్వారా రోగనిరోధక శక్తి పెరిగి పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండడానికి ఉపయోగపడుతుందన్నారు. గతంలో ఈ డ్రాప్స్ ని పిల్లలందరికీ క్రమం తప్పకుండా ఇచ్చేవారన్నారు. ఈ కార్యక్రమం కోసం స్వర్ణప్రాషన్ తయారు చేసేందుకు ముందుకు వచ్చిన హరే కృష్ణ హరే రామ వారికి కృతజ్ఞతలు తెలిపారు.

కోటి 10 లక్షల రూపాయల స్వర్ణప్రాషన్ తయారు చేసి ఉచితంగా పంచేందుకు ముందుకు వచ్చిన హరే కృష్ణ హరే రామ సంస్థ వారికి ధన్యవాదాలు చెప్పారు. ఈ డ్రాప్స్ 10 నెలలు వాడడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరిగి ఎంతగానో ఆరోగ్యవంతంగా తయారవుతారన్నారు. బంగారం ఉపయోగించి తయారు చేసే ఈ ఆయుర్వేద డ్రాప్స్ ని 18 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలు తీసుకోవచ్చని, అదేవిధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కండ్ల కలక రాకుండా కాపాడుకోవచ్చన్నారు. కండ్ల కలక గాలిలో కానీ వేరే విధంగా కానీ రాదు, అది ముట్టుకోవడం వల్ల వస్తుందని, కాబట్టి దానికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. వాటికి సంబంధించిన అన్ని ఆయింట్మెంట్స్, డ్రాప్స్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అందుబాటులో ఉంచిందని తెలిపారు.

3,80,000 మంది పిల్లలకు రాష్ట్రవ్యాప్తంగా కండ్ల కలక రాకుండా ఉండేందుకు ఉచితంగా నివారణ ఆయుర్వేద మందులను ప్రభుత్వం పంపిణీ చేయనుందని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని సిద్దిపేట్ బాయ్స్ హై స్కూల్లో ప్రారంభించడం సంతోషంగా ఉందని ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో కండ్ల కలక రాకుండా జాగ్రత్త పడేందుకు ఆయుర్వేద మందు ఉపయోగపడుతుందన్నారు. కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే కండ్ల కలక రాకుండా జాగ్రత్త పడవచ్చన్నారు. ఒకవేళ వచ్చినా ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చి సరైన వైద్యం తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement