Wednesday, May 1, 2024

అర్ధరాత్రి పబ్‌లు తెరిచి ఉంటే భౌతిక దాడులే.. డ్రగ్స్ విషసంస్కృతికి అడ్డుకట్ట వేస్తాం: రేవంత్ రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: రాత్రి గం. 11.30 తర్వాత కూడా పబ్‌లు తెరిచి ఉంటే భౌతికదాడులకు పాల్పడాలని కాంగ్రెస్ యువజన, విద్యార్థి విభాగాలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. పబ్‌లు, అక్కడ దొరికే మత్తుపదార్థాల విషయంలో పోలీసులు చర్యలు తీసుకోవాలని, లేదంటే భౌతికదాడులు చేసైనా సరే ఈ విష సంస్కృతికి అడ్డుకట్ట వేస్తామని అన్నారు. అమెరికా పర్యటన ముగించుకుని ఢిల్లీ చేరుకున్న ఆయన బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇన్నోవా కార్లో బాలికపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనలో పోలీసులు, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికలు, అధికారంలో భాగస్వాములైన టీఆర్ఎస్-ఎంఐఎం పార్టీలు అత్యాచారాలు, హత్యల్లోనూ భాగస్వాములయ్యాయని మండిపడ్డారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసేలా పబ్‌లు, డ్రగ్స్ కల్చర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆరోపించారు.

మద్యం అమ్మకాల ద్వారా ఆదాయం సమకూర్చుకోవడంపై ప్రభుత్వం దృష్టిపెట్టిందని ధ్వజమెత్తారు. అలాగే పబ్‌ల వ్యాపారం వెనుక రాజులు, యువరాజులు ఉన్నారని, వారికి సంబంధించినవారే వీటిని నిర్వహిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అందుకే అర్థరాత్రి దాటినా సరే మద్యం విక్రయాలు కొనసాగేలా అధికారులపై ఒత్తిడి చేస్తున్నారని సూత్రీకరించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక హైదరాబాద్ నగరంలో 150 పబ్‌లకు అనుమతులిచ్చారని వెల్లడించారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రభుత్వ స్థలంలో పబ్‌లను 24 గంటలు నిర్విరామంగా నిర్వహిస్తున్నారని, అవి బ్రోతల్ హౌజ్‌లుగా, మహిళల పికప్ పాయింట్లుగా మారాయని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ హైదారాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అసాంఘీక కార్యాకలాపాలకు అడ్డాగా మార్చి విశ్వనగరంగా వర్ధిల్లాల్సిన హైదరాబాద్‌ను విషనగరంగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఫోరెన్సిక్ ఆధారాలు మాయం.. అసలు నిందితులను తప్పించే యత్నం?
ఇన్నోవా వాహనంలో బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటనపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పిన కథనం చూస్తుంటే ఈ నేరంతో ప్రమేయమున్న కొందరు కీలక వ్యక్తులను తప్పించే ప్రయత్నం చేస్తున్నట్టుగా స్పష్టమవుతోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. నిందితులు, బాధితురాలు తొలుత ప్రయాణించిన బెంజ్ కారు, ఆ తర్వాత ప్రయాణించిన ఇన్నోవా వాహనం ఈ కేసులో అత్యంత కీలకమైన ఆధారాలని, అలాంటప్పుడు వాటి యజమానుల వివరాలను ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. మోటార్ వాహన చట్టం ప్రకారం నేరానికి ఉపయోగించిన వాహన యజమానులపై కేసులు పెట్టాలని, అలాగే పోక్సో చట్టం ప్రకారం నేరానికి సహకరించినవారిపై కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వంలో కీలక పాత్ర వహిస్తున్న వక్ఫ్ బోర్డ్ ఛైర్మెన్, ఎంఐఎం నేతల పిల్లలు ఈ ఘోరానికి పాల్పడ్డారని, వారిలో మైనర్లు ఉన్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చెబుతున్నారని గుర్తుచేశారు.

అలాగే ఇన్నోవాను డ్రైవర్ నడపలేదని కమిషనర్ చెప్పారని, అలాంటప్పుడు వాహనాన్ని నడిపిన మైనర్లపై, అందుకు అవకాశం కల్పించిన యజమానిపై ఎమ్వీ యాక్ట్ ప్రకారం చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. అలాగే ఇన్నోవాపై ప్రభుత్వ వాహనం అని మొదటి రాసి ఉందని, తర్వాత దాన్ని తొలగించినట్టు తెలిసిందని చెప్పారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు ఉపయోగించాల్సిన కారును అసాంఘిక కార్యక్రమాల కోసం ఉపయోగించారని మండిపడ్డారు. అత్యాచారానికి వినియోగించిన ఇన్నోవా కారును ఎక్కడ స్వాధీనం చేసుకున్నారో పోలీసులు చెప్పలేదని, అందులో దొరకాల్సిన కీలకమైన ఫోరెన్సిక్ ఆధారాలను తుడిచిపెట్టే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తోందని రేవంత్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. తద్వారా నిందితులపై కేసును బలహీనపరిచి, శిక్ష నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై మీడియా అడిగిన ప్రశ్నలకు సీవీ ఆనంద్ దాటవేత సమాధానాలిచ్చారని గుర్తుచేశారు.

ఇంత జరిగినా సమీక్ష లేదేమి?
హైదరాబాద్‌లో జరుగుతున్న సంఘటనలు బ్రాండ్ ఇమేజిని దెబ్బతీస్తున్నాయని, వారంపది రోజుల్లో నగర పరిధిలోనే పలు అత్యాచార ఘటనలు వెలుగుచూశారని రేవంత్ రెడ్డి అన్నారు. వీటన్నింటికీ కారణం పబ్‌లు, అక్కడ విచ్చలవిడిగా దొరుకుతున్న మాదకద్రవ్యాలేనని సూత్రీకరించారు. 18 ఏళ్ల లోపువారిని మద్యం అమ్మే ప్రదేశాలకు అనుమతించకూడదని చట్టం చెబుతోందని, కానీ అమ్నేషియా పబ్‌లో మైనర్లను ఎలా అనుమతించారని ప్రశ్నించారు. అనుమతించిన పబ్ యాజమాన్యంపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఫుడ్డింగ్ మిక్సింగ్ పబ్ కేసులోనూ అసలైన యజమానిని తప్పించారని రేవంత్ అన్నారు. వక్ఫ్ బోర్డ్ ఛైర్మెన్‌పై కేసీఆర్ ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. బాలికలపై వరుసగా అత్యాచారాలు, ఘోరాలు జరుగుతుంటే సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు ఎందుకు సమీక్ష నిర్వహించలేదని ప్రశ్నించారు.

- Advertisement -

జాతీయ, అంతర్జాతీయ అంశాలపై స్పందించే ఒవైసీ, బాలిక రేప్ విషయంలో ఎందుకు స్పందించడం లేదని అన్నారు. పబ్బులు, డ్రగ్స్‌పై ముఖ్యమంత్రి‌కి సీపీ సీవీ ఆనంద్ నివేదిక ఇచ్చారా? ఇచ్చినా ముఖ్యమంత్రి దాన్ని పట్టించుకోలేదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. హైదరాబాద్‌ను రక్షించుకునే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని, పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోతే భౌతికదాడులతోనైనా సమాధానం చెబుతామని హెచ్చరించారు. ఎయిర్‌పోర్ట్ పబ్‌ల అనుమతులను తక్షణమే రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారు. వరుస ఘటనలపై ముఖ్యమంత్రి తక్షణమే సమీక్ష నిర్వహించాలని కూడా రేవంత్ అన్నారు. అసాంఘిక కార్యాకలాపాలకు హైదరాబాద్ అడ్డాగా మారిందని, ఇక్కడికి రావాలంటే విదేశీయులు భయపడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement