Monday, May 6, 2024

డైరెక్టుగా పైక్లాసులకు ప్రమోట్

హైదరాబాద్: ఒకవైపు రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులు, మరోవైపు ఎండల తీవ్రత నేపథ్యంలో ఈ విద్యాసంవత్సరానికి ప్రాథమిక పాఠశాలలు ఇక తెరుచుకునే పరిస్థితులు రాష్ట్రంలో కనబడుటలేదు. కరోనా టీకా అందుబాటులోకి వచ్చినా కూడా గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లి పెరుగుతుండటం అధికారుల్లో ఆందోళన కల్గిస్తోంది. పైగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో విద్యార్థులు కరోనా బారిన పడుతుండడం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో ప్రీ ప్రైమరీ, ప్రైమరీ పాఠశాలలు ఒకవేళ తెరుస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు. పైగా తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను ఈ విద్యాసంవత్సరంలో పాఠశాలలకు పంపడానికి అంతగా సుముఖత చూపించడంలేదు. కరోనా కేసులు, కొత్త స్ట్రెయిన్‌ భయం, ఎండల తీవ్రత తదితర కారణాలతో తల్లిదండ్రులు కూడా తమ చిన్న చిన్న పిల్లల్ని బడులకు పంపించే పరిస్థితి ఉండక పోవచ్చని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈనేప థ్యంలోనే 2020-21 విద్యా సంవత్సరంలో నర్సరీ నుంచి 5వ తరగతులకు బడులు తెరవరాదని విద్యాశాఖ ప్రాథమికంగా ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ ప్రాథమిక పాఠశాలలు ఇక తెరిచే అవకాశం కనబడుటలేదు.


భౌతిక దూరం పాటించడం కష్టమే!
కరోనా భయం ఇంకా పూర్తిగా తల్లిదండ్రుల్లో వీడలేదు. ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులంతా 10 ఏళ్లలోపు వారే ఉంటారు. ఒక వేళ స్కూళ్లు తెరిచినా ఈ వయస్సు పిల్లలు భౌతికదూరం పాటించడం కష్టమే. చిన్నారులు కోవిడ్‌ బారిన పడితే తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు ప్రమాదం ఉండొచ్చని అదికాస్త ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చిపెడుతోందని అధికారులు అంచనాకి వచ్చారు. ఈక్రమంలోనే 5వ తరగతి వరకు ప్రత్యక్ష బోధన అవసరం లేదని అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి విద్యార్థులు దాదాపు 12 లక్షల మంది ఉంటే, ప్రైవేటులో చదివే వారు దాదాపు 15 లక్షల మంది ఉంటారు. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ చదివే వారు దాదాపు 7 లక్షల వరకు ఉంటారు. వీరంతా 3 నుంచి 10 ఏళ్ల లోపు పిల్లలే ఉండడంతో మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ తరగతి గది బోధన చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. అందులోనూ ప్రైమరీ స్కూల్స్‌ అన్నీ కూడా చిన్న చిన్న భవనాల్లో ఉంటాయి. విశాలమైన తరగతి గదులు అక్కడ ఉండవు. ఒక వేళ ఉన్నా అందులోనూ పరిమితికి మించి ఎక్కువ మంది విద్యార్థులను కూర్చోబెట్టి బోధిస్తుంటారు. దీనివల్ల పిల్లలు కోవిడ్‌ బారిన పడే ప్రమాదం ఉంటుంది.
కోవిడ్‌ నిబంధనల మేరకు తరగతి గదికి 20 మంది చొప్పున విద్యార్థులు, విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న స్కూళ్లలో షిఫ్ట్‌ల వారిగా తరగతి బోధన చేయడం సాధ్యం కాని పని. కోవిడ్‌ నిబంధనల మేరకు ప్రత్యక్ష బోధనకు తరగతి గదులు సరిపడా లేకపోవడంతో 6 నుంచి 8వ తరగతి పాఠశాలలు కొన్ని ఇప్పటికే మూతపడ్డాయి. ఈ నేపథ్యలో అసలు 5వ తరగతి వరకు తరగతి గది బోధన లేకుండా ఆన్‌లైన్‌ క్లాసులను యథావిధిగా కొనసాగిస్తూ వచ్చే విద్యాసంవత్సరానికి ప్రమోట్‌ చేయాలనే ఆలోచనలో విద్యాశాఖ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement