Friday, May 10, 2024

వీసా గడువు ముగిసిన నైజీరియన్లు.. తిరిగి పంపించేందుకు స‌న్నాహాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : వీసాల గడువు ముగిసినా హైదరాబాద్‌లోనే తిష్ట వేసి మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తున్న నైజీరియన్లను వారి స్వస్థలాలకు పంపేందుకు హైదరాబాద్‌ పోలీసులు కార్యాచరణ సిద్ధం చేశారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తరచూ పట్టుబడుతున్న మాదక ద్రవ్యాల వ్యవహారంలో నైజీరియన్ల పాత్ర ప్రముఖంగా ఉండడంతో హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గోవాతో పాటు ఢిల్లిd, కోల్‌కతా, పంజాబ్‌, హరియాణా ఇతర రాష్ట్రాల నుంచి నైజీరియన్లు మాదక ద్రవ్యాలను గుట్టు చప్పుడు కాకుండా తీసుకువచ్చి ఇక్కడి యువత, విద్యార్థులకు అందిస్తున్నారన్న సంగతి తెలిసిందే.

పోలీసులకు పట్టుబడుతున్న మాదక ద్రవ్య ముఠాల్లో అత్యధికంగా నైజీరియన్లే ఉండడంతో పోలీసులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఉన్నత విద్య అభ్యసించేందుకు ఆయా దేశాల నుంచి హైదరాబాద్‌కు వస్తున్న నైజీరియన్లు తాము చేరిన కోర్సులు పూర్తి చేసినా, వీసా గడువు ముగిసినా ఇక్కడే ఉంటూ కాలం వెల్లబుచ్చుతున్నారని కొంత మంది అక్రమ దందాలకు అలవాటు పడి ఇక్కడి యువతీ యువకులను పెడదారి పట్టిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు.

దేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన నైజీరియన్లు సైతం హైదరాబాద్‌కు వచ్చి తల దాచుకుంటూ మాదక ద్రవ్యాల వ్యాపారం చేస్తున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ వ్యాపారంతో పాటు ఇతర అక్రమ మార్గాల ద్వారా డబ్బులు సంపాదించేందుకు నైజీరియన్లు దారులు వెతుక్కుంటున్నారని ఈ పరిస్థితుల్లో వీసా గడువు ముగిసిన వారందర్నీ గుర్తించి వెంటనే వారి వారి దేశాలకు పంపించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసే పనిలో నగర పోలీసులు పడ్డారు. అవసరమైతే విమాన ఛార్జీలను ప్రభుత్వమే భరించి వారిని రాష్ట్రం నుంచి పంపించి వేయాలని భావిస్తున్నట్టు సమాచారం.

హైదరాబాద్‌లో ఉంటున్న నైజీరియన్లు తాజాగా దొంగతనాలు, దోపిడీలతో పాటు ఇతర నేరాలకు పాల్పడుతునట్టు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌లో ఉంటూ తరచూ గోవా వెళ్లి అక్కడి నుంచి మాదక ద్రవ్యాలు తీసుకువచ్చి ఇక్కడి యువతకు భారీ మొత్తంలో విక్రయిస్తున్న ఘటనలు తరచూ వెలుగు చూస్తున్నాయి. ఎంపిక చేసిన కొన్ని పబ్‌లతో పాటు అంతర్జాతీయ పాఠశాలలు, వివిధ ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని అక్రమాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో నేరానికి పాల్పడి తప్పించుకునేందుకు నైజీరియన్లు సైబరాబాద్‌లో తల దాచుకుంటున్నారని అక్కడ మరో నేరానికి పాల్పడి జిల్లాలకు వెళ్లి కొంతకాలం కాలం గడుపుతున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. హైదరాబాద్‌లో మొత్తం 2500 మంది నైజీరియన్లు ఉండగా వీరిలో 750 మంది వీసా గడువు ముగిసినా ఇక్కడే తల దాచుకుంటున్నట్టు పోలీసులు గుర్తించారు. తమ దేశంలో ఉంటున్న నైజీరియన్లు వీసా గడువు ముగిసినా ఇంకా ఉంటున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ ద్వారా ఆయా దేశాల భారత కాన్సులేట్‌లకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే లేఖలు రాసింది.

- Advertisement -

వీసా గడువు ముగిసిన వారిని తమ దేశానికి పిలిపించుకోవాలని లేని పక్షంలో తామే బలవంతంగా వారిని పంపించి వేస్తామని గతంలో హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయినా స్పందన లేకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం నైజీరియన్లకు విమాన టికెట్లు భరించి ఓ ప్రత్యేక పోలీసు అధికారిని వారివెంట పంపించి అప్పగించి రావాలన్న ప్రతిపాదనలపై సమాలోచనలు జరుపుతోంది. హోం శాఖకు చెందిన ఉన్నతాధికారులతో సమాలోచనలు జరిపాకే ఈ ప్రతిపాదనపై తుది నిర్ణయం తీసుకోవాలన్న భావనతో పోలీసు అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. కాగా ఢిల్లితో పాటు ఆయా రాష్ట్రాల రాజధానులు, ముఖ్య పట్టణాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వందల సంఖ్యలో నైజీరియన్లు ఉన్నారని అందులో కొంతమంది చదువును కొనసాగిస్తుండగా మరికొందరు కేవలం నేరాలకు పాల్పడి పోలీసుల వలలో చిక్కుతున్నారని నగర పోలీసులు చెబుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement