Saturday, May 25, 2024

హ‌ఫీజ్ పేట భూములు ప్రైవేటు వ్య‌క్తుల‌వే….హైకోర్టు

140 ఎకరాల వివాదాస్పద ల్యాండ్స్‌పై హైకోర్టు తీర్పు
ప్రభుత్వం, వక్ఫ బోర్డులకు సంబంధం లేదని స్పష్టీకరణ
సుప్రీంకు వెళ్లనున్న ప్రభుత్వం
వివాదాస్పద భూమిపైనే ఏపీ మాజీమంత్రి అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరామ్‌లు కిడ్నాప్‌ కేసులో అరెస్టు

హైదరాబాద్‌, : హైదరాబాద్‌లోని హఫీజ్‌పేట వివాదాస్పద భూములపై రాష్ట్ర హైకోర్టు తీర్పును వెలువ రించింది. 140 ఎకరాల వివాదాస్పద భూమి ప్రభుత్వ, వక్ఫ్‌ బోర్డుది కాదని ఈ భూమి ప్రైవేట్‌ వ్యక్తులదని ఉన్నత న్యాయస్థానం మంగళవారం తీర్పు ఇచ్చింది. సర్వే నెంబర్‌ 80లోని ఈ భూమి ప్రైవేట్‌ వ్యక్తులదేనని స్పష్టం చేసింది. పిటీషనర్లకు రూ.4 లక్షలు చెల్లించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని, వక్ఫ్‌ బోర్డును ఆదేశించింది. ఈ వివాదాస్పద భూములకు సంబంధించి ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన మాజీ పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ, నగరానికి చెందిన ప్రవీణ్‌రావు మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే. ఈ 140 ఎకరాల్లో 50 ఎకరాలు ప్రవీణ్‌ రావు సహా యజమానుల పేరిట రిజిస్ట్రేషన్‌ చేయాలని హైకోర్టు ఆదేశించింది. అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లి ఈ తీర్పును సవాల్‌ చేయాలని ప్రభు త్వం నిర్ణయించింది. ఈ భూ వివాదంలోనే ప్రవీణ్‌రావును అపహరించిన కేసులో అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరాం ఇతరులు అరెస్టయిన సంగతి విదితమే. బోయిన్‌పల్లి కిడ్నాప్‌కు కారణమైన హఫీజ్‌పేట భూముల వ్యవహారం లో అనేక చిక్కుముడులున్నాయి. ఈ భూములను భూమా నాగిరెడ్డి కుటుంబం కోనుగోలు చేసిందా? వారినుంచి ప్రవీణ్‌రావు కుటుంబం కొనుగోలు చేసిందా, లేక జీపీవో చేసిందా అనే అంశాలపై స్పష్టత లేదు. హఫీజ్‌పేటలో సర్వే నెంబర్‌ 80లో అనేక మంది కబ్జాల్లో ఉన్నారు. నిషేధిత జాబితాలో ఉన్న ఈ భూములకు రిజిస్ట్రేషన్లు జరుగుతూనే ఉన్నాయి. 2006లో భూమా నాగిరెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులు కొన్ని భూములను కొనుగోలు చేశారు. పైగా వారసులు కొందరు స్థానికుల నుంచి నాలుగు దఫాలుగా భూములను కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. అయితే వివాదాస్పద సర్వే నెంబర్‌ 80లోని 66 ఎకరాలను భూమా కుటుంబం 2006లో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్‌ చేసుకున్నట్టుగా నాలుగు డాక్యుమెంట్లు ఉన్నాయి. ఇందులో భూమా నాగిరెడ్డి అన్న కుమారుడు బ్రహ్మానందరెడ్డి, జగన్‌నాథ్‌రెడ్డి, కిషోర్‌రెడ్డిలతో పాటు మరో 28 మంది పేర్లతో ఈ భూములున్నాయి. ఈ భూములకు 19.8 కోట్లు భూమా కుటుంబం చెల్లించినట్టుగా రికార్డుల్లో ఉంది. 2008లో ఐశ్వర్య కన్‌స్ట్రక్షన్‌ కంపెనీకి జీపీఏ చేసినట్టుగా రికార్డుల్లో నమోదైంది. 47 ఎకరాల భూమిని ఐశ్వర్య కన్‌స్ట్రక్షన్‌ కంపెనీకి ఇవ్వగా, మరో 25 ఎకరాలను సేల్‌ కం రిజిస్ట్రేషన్‌ చేశారు. అయితే ఐశ్వర్య కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ కానీ, సీవీఎస్‌ రాజారాం, పి.రెడ్డి, గంగా రవీందర్‌ కుమార్‌ నుంచి గానీ భూములు చేతులు మారినట్టు రికార్డుల్లో లేదు. దీంతో 12 ఏళ్ల తర్వాత ప్రవీణ్‌రావుతో భూమా కుటుంబానికి వివాదం వచ్చింది. దీంతో అప్పటి నుంచి సమస్య తీవ్రమైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement