Sunday, April 28, 2024

Financial White Paper – రేపు శాస‌న స‌భ‌లో ఆర్థిక శ్వేత ప‌త్రం విడుద‌ల చేయ‌నున్న ప్ర‌భుత్వం

హైద‌రాబాద్ – రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్ ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే శాసనసభలో ఈ వివరాలను వెల్లడించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. తిరిగి బుధవారం నాడు ప్రారంభం కానున్న శాసనసభ ముందుకు రానున్న ఆర్థికశాఖ శ్వేతపత్రంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర ఆవిర్భావం మొదలు ఇప్పటివరకు వివిధ రూపాల్లో ఖజానాకు వచ్చిన మొత్తం, చేసిన వ్యయానికి సంబంధించిన పూర్తి వివరాలతో శ్వేత పత్రం విడుదల చేయనుంది ప్ర‌భుత్వం ..

కాగా, ఈ శ్వేత‌ప‌త్రంలో ప్రత్యేకించి అప్పుల విషయమై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించ‌నుంది. 2014 జూన్ రెండు నాటికి ఉన్న మిగులు బడ్జెట్ క్రమంగా ఎలా లోటులోకి వెళ్లింది. వివిధ రకాలుగా తీసుకున్న అప్పులు ఏ మేరకు పెరిగాయన్న విషయాలను వివరించేందుకు సర్కార్ రంగం సిద్ధం చేసింది. ముఖ్యంగా ఆర్థిక, విద్యుత్‌శాఖలపై ఎక్కువగా దృష్టి సారించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు అధికారులు దీనిపై కసరత్తు చేస్తున్నారు. శ్వేతపత్రంలో ఉండాల్సిన అంశాలు, వివరాలకు సంబంధించిన వివరాలను సిద్ధం చేస్తున్నారు. రంగాల వారీగా చేసిన ఖర్చు, ప్రస్తుత ఆర్థిక పరిస్థితి సంబంధిత వివరాలను శ్వేత పత్రంలో ప్రధానంగా పేర్కొననున్నారు. బుధ‌వారం నాడు ఈ శ్వేత‌ప‌త్రాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్ర‌భుత్వ విడుద‌ల చేయ‌నుంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement