Sunday, April 28, 2024

HYD: మణికొండలో చైర్మన్ పై వీగిన అవిశ్వాసం.. కస్తూరి నరేందర్ వర్గానిదే పైచేయి

అవిశ్వాసం ప్రతిపాదించిన కౌన్సిలరే డుమ్మా

20మంది కౌన్సిలర్లలో అవిశ్వాసానికి అనుకూలంగా హాజరైంది 8మందే.

మణికొండ, (ప్రభ న్యూస్): హైదరాబాద్‌లో ప్రముఖ ప్రాంతంగా ఎదిగిన మణికొండ మునిసిపాలిటీలో చైర్మన్ కస్తూరి నరేందర్ ముదిరాజ్ పై అసమ్మతి కౌన్సిలర్లు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అవిశ్వాసం ప్రతిపాదించిన కౌన్సిలర్ ఓటింగ్ కు డుమ్మా కొట్టడంతో అవిశ్వాసం తుస్ మంది. చైర్మన్ సహా మణికొండ మునిసిపాలిటీలో మొత్తం 20మంది కౌన్సిలర్లు ఉన్నారు. గత నెలలో కొందరు చైర్మన్ పై అవిశ్వాసం ప్రతిపాదించారు. అయితే, ఆ తర్వాత రాజకీయం అనేక మలుపులు తిరిగింది. వాస్తవానికి చైర్మన్ కు తగిన బలం ఉన్నప్పటికీ.. అసమ్మతి కౌన్సిలర్లు పట్టు విడవలేదు. ఇరుపక్షాలు క్యాంపు రాజకీయాలు నిర్వహించాయి.

చివరకు గురువారం అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ కు హాజరైన అసమ్మతి క్యాంపు కౌన్సిలర్లు 8 మంది మాత్రమే. దీంతోనే తీర్మానం వీగిపోయినట్లు స్పష్టం కావడంతో వీరంతా బలం లేదని తెలిసి మునిసిపల్ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. కాగా, అవిశ్వాసం ప్రతిపాదించిన కౌన్సిలర్లలో ఆలస్యం నవీన్, పి.శైలజ, బి.పద్మారావు, ఎన్.వందన నాగేష్, వి.హైమాంజాలి అనీల్ కుమార్, బి.కావ్య శ్రీరాములు, కె.నాగలక్ష్మి, బి.శ్వేతా రవికాంత్ రెడ్డి గురువారం ఓటింగ్ కు వచ్చినవారిలో ఉన్నారు. వీరిలో ముగ్గురు బీజేపీ, ముగ్గురు బీఆర్ఎస్, ఒకరు కాంగ్రెస్ వారు కాగా మరొకరు స్వతంత్ర కౌన్సిలర్.

- Advertisement -


పంతం నెగ్గించుకున్న చైర్మన్..
తనపై ప్రతిపాదించిన అవిశ్వాసంలో పస లేదని.. అది పైసల విశ్వాసమని కాంగ్రెస్ పార్టీకి చెందిన మణికొండ మునిసిపాలిటీ చైర్మన్ కస్తూరి నరేందర్ ముదిరాజ్ మొదటినుంచి అంటున్నారు. దీనికి తగ్గట్లే గురువారం అవిశ్వాసం వీగిపోయిందా ? అనిపిస్తోంది. చైర్మన్ మినహా 19మంది కౌన్సిలర్లు ఉండగా.. వీరిలో 8 మంది మాత్రమే అవిశ్వాసంపై ఓటింగ్ కు వచ్చారు. అంటే.. సరైన సంఖ్యా బలం లేదని తేలిపోయింది. దీంతో చైర్మన్ పంతం నెగ్గినట్లైంది. కాగా, మునిసిపాలిటీలో నాలుగేళ్ల కిందట జరిగిన ఎన్నికల్లో హంగ్ ఏర్పడింది.


ముందే చెప్పిన ‘ఆంధ్రప్రభ’
మణికొండలో చైర్మన్ పై ప్రతిపాదించిన అవిశ్వాసం నిలవదని ‘ఆంధ్రప్రభ’ మొదటినుంచి చెబుతోంది. స్థానిక రాజకీయ పరిస్థితుల కారణంగా ప్రతిపాదించిన ఈ అవిశ్వాసం గట్టెక్కడం కష్టమేనని పేర్కొంది. దీనిపై వరుసగా పలు కథనాలను ప్రచురించింది. సుదీర్ఘంగా సాగిన పరిణామాలను ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేసింది. చివరకు ‘ఆంధ్రప్రభ’ చెప్పినట్లే అంతా జరిగింది. దీన్నంతటినీ గమనించినవారు సైతం ‘ఆంధ్రప్రభ’ వాస్తవాలను ప్రచురించిందని చెప్పడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement