Friday, May 3, 2024

Delhi | కవితకు సుప్రీంలో భారీ ఊరట.. కేసు విచారణ నవంబర్ 20కి వాయిదా

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో విచారణ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) దర్యాప్తు విధానాన్ని తప్పుబడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కేసులో నవంబర్ 20 వరకు ఎలాంటి సమన్లు జారీ చేయవద్దంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. అందుకు ఈడీ కూడా అంగీకరించింది. మహిళను విచారణకు పిలిచే విషయంలో సీఆర్పీసీ నిబంధనలను ఈడీ పాటించడం లేదని ఆరోపిస్తూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ తరహా అభ్యంతరాలతో గతంలో దాఖలైన అభిషేక్ బెనర్జీ (తృణమూల్ కాంగ్రెస్ నేత), నళిని చిదంబరం (కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం భార్య) పిటిషన్లతో జతచేసిన సుప్రీంకోర్టు, మంగళవారం జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాన్షు ధులియాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

కేసు విచారణను నవంబర్ 20 వరకు వాయిదా వేస్తూ అప్పటి వరకు కవితకు ఎలాంటి సమన్లు జారీ చేయవద్దని దర్యాప్తు సంస్థ ఈడీని ఆదేశించింది. గత విచారణ సందర్భంగా ఇంటర్‌లాక్యుటరీ అప్లికేషన్ దాఖలు చేసిన కవిత, కేసు సుప్రీంకోర్టులో పెండింగులో ఉండగా తాజాగా సమన్లు జారీ చేసి విచారణకు పిలవడాన్ని తప్పుబట్టారు. నళిని చిదంబరం కేసులో మహిళలకు ఇచ్చిన వెసులుబాటును తనకు కూడా ఇవ్వాలని, సుప్రీంకోర్టులో కేసు తేలే వరకు సమన్లతో ఇబ్బందిపెట్టకుండా కట్టడి చేయాలని అభ్యర్థించారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధులను విచారణ జరిపే సమయంలో పాటించాల్సిన నిబంధనలు, వెసులుబాట్ల గురించి గుర్తుచేశారు. మంగళవారం నాటి విచారణలో కవిత తరఫున సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపిస్తూ.. ఇవే అంశాలను పునరుద్ఘాటించారు.

ఈ సమయంలో జోక్యం చేసుకున్న జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్.. “ఈ అంశాన్ని తాము పరిశీలించాల్సి ఉంది. ఈలోగా ఆమె (కవిత)ను విచారణకు పిలవకండి” అంటూ ఆదేశించారు. అదే సమయంలో మహిళ అయినంత మాత్రాన అసలు విచారణకు పిలవకూడదని (సాక్షిగా లేదా మరే హోదాలోనైనా) చెప్పడం సరికాదని అన్నారు. అయితే మహిళలను విచారణ జరిపే విషయంలో కొన్ని ప్రత్యేక వెసులుబాట్లు ఉన్నాయని తెలిపారు. అలాగే చట్టాన్ని దుర్వినియోగం చేసిన ఉదంతాలు ఉన్నాయని, అంతమాత్రాన అన్ని కేసులను ఒకేగాటన కట్టలేమని వ్యాఖ్యానించారు.

- Advertisement -

ఈడీ తరఫున విచారణకు హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు, తదుపరి విచారణ తేదీ వరకు తాము ఎలాంటి సమన్లు జారీ చేయబోమని చెప్పారు. అది తన మాటకాదని, దర్యాప్తు అధికారులు కూడా తన పక్కనే ఉన్నారని, వారి హామీగానే చెబుతున్నానని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement