Tuesday, May 28, 2024

TS | 500 టన్నుల రేషన్‌ బియ్యం పట్టివేత

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో దాదాపు 1.05 కోట్ల రూపాయల విలువచేసే 500 టన్నుల రేషన్‌ బియ్యాన్ని టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా కోటి విలువ చేసే మూడు లారీలు, నాలుగు డీసీఎంలను పోలీసులు, పౌరసరఫరాల అధికారులు సీజ్‌ చేశారు. రేషన్‌ బియ్యం అక్రమంగా తరలిస్తున్న కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్‌ రెడ్డి పరారీ కాగా మరో నిందితుడు రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాగా నిందితుడు రవిని బియ్యం రవాణాపై ప్రశ్నించారు. రైతులు దగ్గర నుంచి ప్రభుత్వం సేకరించిన వడ్లను తీసుకుని బయట విక్రయించుకుంటున్నట్లు నిందితుడు తెలిపారు. ఈ ఘటనపై సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్‌ మాట్లాడుతూ ప్రభుత్వానికి ఇవ్వాల్సిన 60 శాతం బియ్యం ప్రజల దగ్గర ఉన్న రేషన్‌ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇవే బియ్యాన్ని రీసైక్లింగ్‌ చేసి ప్రభుత్వానికి పంపిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు.

టాస్క్‌ ఫోర్స్‌, పౌరసరఫరాల అధికారులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో పాశమైలారం పారిశ్రామిక వాడలో ఓ ప్లాంట్‌ 500 టన్నుల బియ్యం పట్టుబడ్డాయన్నారు. పారిశ్రామిక వాడలో గుట్టుచప్పుడు కాకుండా నిందితులు ఓ ప్లాంట్‌ను అద్దెకు తీసుకుని రైస్‌ మిల్‌ ఏర్పాటు చేసి రీసైక్లింగ్‌ వ్యవహారం నడిపిస్తున్నారని వెల్లడించారు.

గోనె సంచులపై పౌరసరఫరాల శాఖకు సంబంధించిన దొంగ ముద్రలు వేసి, దొంగ బిల్లులు సృష్టించి అదిలాబాద్‌ రాంపూర్‌ వినాయక ట్రేడర్స్‌ పేరు మీద ఎఫ్‌సీఐ గిడ్డంగికి ఇతర జిల్లాలకు పంపిణీ చేసినట్లు గుర్తించినట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని ఎస్‌పీ రూపేష్‌ వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement