Tuesday, October 8, 2024

TS: టీఎస్‌ఆర్టీసీకి జాతీయ అవార్డుల పంట …

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ)కి జాతీయ స్థాయి అవార్డుల పంట పండింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్‌ ఆఫ్‌ స్టేట్‌ రోడ్డు ట్రాన్స్‌పోర్ట్‌ అండర్‌టేకింగ్స్‌ (ఏఎస్‌ఆర్‌టీయూ) ప్రతి ఏటా అందించే ప్రతిష్టాత్మక ఐదు నేషనల్‌ బస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డులు సంస్థను వరించాయి. 2022-23 ఏడాదికి గాను రహదారి భద్రత, ఇంధన సామర్థ్య నిర్వహణ, సిబ్బంది సంక్షేమం, సాంకేతికత వినియోగం, తదితర కేటగిరిల్లో ఈ జాతీయ స్థాయి పురస్కారాలు టీఎస్‌ఆర్టీసీకి దక్కాయి. రహదారి భద్రతలో ప్రథమ బహుమతి, ఇంధన సామర్థ్య నిర్వహణ మొఫిషిల్‌ విభాగంలో ప్రథమ, అర్బన్‌ విభాగంలో ద్వితీయ బహుమతిని టీఎస్ఆర్టీసీ కైవసం చేసుకుంది. సిబ్బంది సంక్షేమం, ఉత్పత్తి కేటగిరిలో ప్రథమ, సాంకేతికత ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలందించినందుకు గాను మరో ప్రథమ బహుమతిని టీఎస్‌ఆర్టీసీ గెలుచుకుంది. ఐదు అవార్డులను న్యూఢిల్లీలో ఈనెల 15న టీఎస్‌ఆర్టీసీ ఉన్నతాధికారులకు అందజేస్తున్నట్లు ఏఎస్‌ఆర్‌టీయూ ప్రకటించింది.

పొన్నం హ‌ర్షం..
టీఎస్ఆర్టీసీ 5 జాతీయ స్థాయి అవార్డులు గెలుచుకోవడం పట్ల రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. సిబ్బంది నిబద్దత, అంకితభావం, క్రమశిక్షణతో పనిచేయడం వల్లే సంస్థకు ఈ పురస్కారాలు దక్కాయని ఆయన అన్నారు. అవార్డులు వచ్చేలా కృషిచేసిన ఆర్టీసీ అధికారులు, సిబ్బందిని అభినందించారు.


అధికారులు, సిబ్బంది కృషికి ప్ర‌తిఫ‌లం – ఎండి స‌జ్జ‌నార్
నేషనల్‌ బస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డులను గెలుచుకోవడంతో ప్రజా రవాణా వ్యవస్థలో టీఎస్‌ఆర్టీసీ దేశానికే రోల్‌ మోడల్‌గా నిలిచిందని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. సంస్థ అభివృద్ధికి, ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందించేందుకు అధికారులు, సిబ్బంది చేస్తున్న కృషికి ఈ అవార్డులు చిహ్నమని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement