Monday, April 29, 2024

Green India | గ్రీన్ ఇండియా చాలెంజ్ అద్భుతమైన కార్యక్రమం.. రాష్ట్రపతి ముర్ము ప్ర‌శంస‌లు

రాజ్యసభ సభ్యుడు, గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త జోగినిపల్లి సంతోష్ కుమార్ ఇవ్వాల (మంగ‌ళ‌వారం) హైదరాబాద్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు. తాను ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని రాష్ట్రపతికి వివ‌రించారు. మొక్కల ప్రాధాన్యాన్ని తెలిపేలా రూపొందించిన “వృక్షవేదం” పుస్తకాన్ని రాష్ట్రపతికి అందించారు. అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించిన ఈ ఐదేళ్లలో నాటిన మొక్కలను, సాధించిన ప్రగతిని, మొక్కలు నాటడంపై ప్రజల్లో కలిగించిన అవగాహన కార్యక్రమాలను రాష్ట్రపతికి పూసగుచ్చినట్టు వివరించారు.

సంతోష్ కుమార్ చెప్పిన విషయాలను ఆసక్తిగా తెలుసుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటుతున్న విషయం త‌నకు కూడా తెలుసని చెప్పారు. అంతేకాదు, తానకు మొక్కలు నాటడం అంటే చాలా ఇష్టమని, ఇప్పటికే అనేక సందర్భాల్లో మొక్కలు నాటినట్లు చెప్పారు. వచ్చే హైదరాబాద్ పర్యటనలో ఈసారి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటుతానని రాష్ట్ర‌ప‌తి అన్నారు. ఇంత నిస్వార్ధమైన కార్యక్రమాన్ని అంకితభావంతో ముందుకు తీసుకుపోతున్న సంతోష్ కుమార్ ను రాష్ట్రపతి అభినందించారు. ప్రజోపయోగమైన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను మరింత ఉధృతంగా ముందుకు తీసుకుపోవాలని ఆకాంక్షించారు.

అనంతరం మాట్లాడిన సంతోష్ కుమార్ .. రాష్ట్రపతి చొరవ, “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” పట్ల వారు చూపించిన అభిమానం అద్భుతమైన అనుభవమని. వారి ప్రేమకు ధన్యవాదాలు తెలుపుతున్న‌ట్టు చెప్పారు. కార్యక్రమంలో జోగినిపల్లి సంతోష్ కుమార్ వెంట రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖా మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement