Sunday, April 28, 2024

TS: విద్యాలయంలో అదనపు సెక్షన్లు మంజూరు చేయండి.. కేంద్ర మంత్రికి ఎంపీ అర్వింద్ లేఖ

నిజామాబాద్ ప్రతినిధి, ఏప్రిల్ 6(ప్రభ న్యూస్) : నిజామాబాద్ కేంద్రీయ విద్యాలయంలో అదనపు సెక్షన్లు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు ఎంపీ అర్వింద్ లేఖ రాశారు. నిజామాబాద్ కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణాన్ని ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ పద్ధతిన ప్రారంభించిన సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా నాగారంలోని డైట్ కళాశాలలో తాత్కాలికంగా కొనసాగుతున్న నిజామాబాద్ కేంద్రీయ విద్యాలయం, భవన నిర్మాణ పనులు పూర్తి చేసుకోవడంతో ఏప్రిల్ ఒకటి నుండి కొత్త భవనంలోకి మారిందని, ప్రస్తుతం ఉన్న తరగతులకు ఒక సెక్షన్ మాత్రమే ఉందని, కావున రెండో సెక్షన్ మంజూరైతే మరింత మంది విద్యార్థులకు ఈ ప్రతిష్టాత్మక విద్యా సంస్థలో విద్యనభ్యసించే అవకాశం ఉంటుందని కోరారు. ఇందుకు పూర్తిగా సహకరించాలని పేరెంట్స్ కమిటీ శుక్రవారం ఎంపీ అర్వింద్ ని కోరారు.

కాగా ఈ విషయంపై నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు అర్వింద్ తక్షణమే స్పందించి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు శనివారం లేఖ రాశా రు. ఈ లేఖలో పలు విషయాలను ఆయన ప్రస్తావిస్తూ.. ఇటీవలే ఈ కేంద్రీయ విద్యాలయం అన్ని హంగులతో ఉన్న కొత్త భవనంలోనికి మారిందని, పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు, తరగతుల గదులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇటీవలే ఒకటో తరగతిలో ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలైంద‌ని, గతంలో ఒకటో తరగతిలో 42 సీట్లు ఉండేవని, కానీ ఇవి 32కు తగ్గించినట్లు సమాచారం ఉందన్నారు. కేంద్రీయ విద్యాలయంలో ఎంపీ కోట ఉన్నప్పుడే నా కార్యాలయానికి 350 వరకు అప్లికేషన్లు వచ్చేవని, ఇలాంటి విద్యాలయాల్లో అడ్మిషన్లకు పెద్ద ఎత్తున డిమాండ్ ఉందన్నారు. సీట్ల పెంపుతో నిజామాబాద్ ప్రాంత వాసులకు ఎంతో లబ్ధి చేరుతుందని ఆయన కోరారు.నిజామాబాద్ కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణం పూర్తయి, అదనపు సెక్షన్ల మంజూరుకు అన్ని అర్హతలు కలిగి ఉందని, రెండో సెక్షన్ నడుపుటకు త్వరితగతిన అధికారులకు ఆదేశాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయన లేఖలో కోరారు. కాగా తమ విన్నపానికి తక్షణమే స్పందించి, అంశాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఎంపీ అర్వింద్ కి విద్యాలయ పేరెంట్స్ కమిటీ తరపున ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement