Saturday, May 4, 2024

TS: ప్రభుత్వానికి మద్యం అమ్మకాలపై ఉన్న శ్రద్ధ సంక్షేమంపై లేదు: ఈటల రాజేందర్

ఎల్బీనగర్, ఆగస్టు 24, ప్రభ న్యూస్ : రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం అమ్మకాలపై ఉన్న శ్రద్ధ ప్రజా సంక్షేమంపై లేదని బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. సేవ్ ఎల్బీనగర్ పేరుతో రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో ఎల్బీనగర్ చౌరస్తాలోని బాబు జగ్జీవన్ రావ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాల వద్ద 48గంటల నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్ష రెండవ రోజు గురువారం ఈటెల రాజేందర్ హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కేసీఆర్ కు ఓటు వేసిన పాపానికి నగర శివారులలోని 5800ఎకరాల దళితుల భూములను లాక్కున్నారని అన్నారు. నాదర్ గుల్ లో 400ఎకరాలు బడంగ్పేట్ లో 40ఎకరాలు దళితుల వ్యవసాయ భూములను ప్రభుత్వం లాక్కుందని తెలిపారు. కంచె చేను మేసే చందంగా పోలీసులే కాలయములై గిరిజన మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ఎంతవరకు సమంజసమంటూ మండిపడ్డారు.

బీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్యం ఆదాయంపై ఉన్న శ్రద్ధ యువత భవిష్యత్తుపై లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎక్సైజ్ శాఖకు మద్యం ద్వారా వచ్చిన ఆదాయం 10వేల 7వందల కోట్లు, ప్రస్తుతం 45 వేల కోట్లకు చేరుకుందని, రాష్ట్రంలో అన్ని సంక్షేమ పథకాలకు 25వేల కోట్లు వెచ్చిస్తుందని, మిగతా 25 వేల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్తున్నాయని ప్రశ్నించారు. మద్యం అమ్మకాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపి ప్రభుత్వం అభివృద్ధి చెందిందని మురిసిపోతుందన్నారు. తెలంగాణలో ఎల్బీనగర్ చౌరస్తాకు ఒక చరిత్ర ఉందని, ఉద్యమ సమయంలో కులం, మతం, వర్గాలు లేకుండా నెలల తరబడి రోడ్లపై వంటావార్పు చేసారని తెలిపారు. తెలంగాణ ఏర్పడితే ఉద్యోగాలు, ప్రజల బతుకులు బాగుపడతాయని భావించి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 1200మంది అమరులయ్యారని గుర్తు చేశారు.

- Advertisement -

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని, మహిళల రక్షణ కోసం అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి 48గంటల దీక్ష చేపట్టడం అభినందనీయమన్నారు. విశ్వనగరం అంటే బంగ్లాలలో ఉండేవారు ఆనందంగా ఉంటే సరిపోదు.. గుడిసెలలోని పేదవారు కూడా సంతోషంగా ఉండాలని, తెలంగాణలోని పేదలందరికీ సొంతింటి కల డబుల్ బెడ్ రూములు కట్టిస్తామన్న ప్రభుత్వం ఇప్పటికి ఎంతమంది పేదలకు ఇల్లు ఇచ్చిందో చెప్పాలన్నారు. ప్రజల ఆకాంక్షలను ఆవిరి చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెబుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి, కార్పొరేటర్ లు కొప్పుల నరసింహారెడ్డి, కళ్లెం నవజీవన్ రెడ్డి, రాగుల వెంకటేశ్వర్ రెడ్డి, పవన్ కుమార్, బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, ఆకుల శ్రీవాణి, నాయకులు చింతల సురేందర్ యాదవ్, కొత్త రవీందర్ గౌడ్, కల్లెం రవీందర్ రెడ్డి, వనపల్లి శ్రీనివాస్ రెడ్డి, నాంపల్లి రామేశ్వర్, విజయ్ కుమార్, నూతి శ్రీనివాసరావు, కృష్ణారెడ్డి, గీతారెడ్డి, మన్నెం అరుణ, తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement