Wednesday, May 1, 2024

స్వరాష్ర్టంలో విద్యారంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి – మంత్రి కొప్పుల

కరీంనగర్ : స్వరాష్ట్రంలో విద్యారంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, సీఎం కేసీఆర్ నిర్ణయాలతో విద్యారంగం బలోపేతమైందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల నగునూర్ ప్రిన్సిపాల్ అధ్యాపకుల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరై చైత్ర “The Beginning” సంచిక ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తెలంగాణ సంస్కృతిని తెలియజేసే ప్రదర్శనలు సాంస్కృతిక ప్రదర్శనలు మాక్ అసెంబ్లీను మంత్రి అభినందించారు. అంతకు ముందు కళాశాల ఆవరణలో మంత్రి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మంత్రి విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గురుకుల నిర్వహణ గురించి అవగాహన కల్పించి విద్యార్థులు వారి భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో నిలవాలని తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… గురుకులాల్లో ఒక్కో విద్యార్థిపై సంవత్సరానికి 1లక్ష 20 వేలు ప్రభుత్వం వెచ్చిస్తుందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఒకేసారి 30 తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు ప్రారంభించారన్నారు. నాటి పాలకుల నిర్లక్ష్యం, వసతుల లేమితో కుదేలైన విద్యారంగం ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో బలోపేతం అయ్యిందన్నారు. తెలంగాణలో గురుకుల విద్యా వ్యవస్థను ఉన్నత స్థాయికి తీసుకు వచ్చారని చెప్పారు. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గురుకులాలు పేరుకు మాత్రమే ఉండేవి, అప్పుడు పిల్లలను చేర్పించడానికి తల్లిదండ్రులు ముందుకు వచ్చేవారు కాదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయిన తర్వాత ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో గురుకులాలకు మహర్దశ పట్టింది, ఇప్పుడు ఈ గురుకులాల్లో అడ్మిషన్లు దొరకడం లేదన్నారు. రాష్ర్ట ఆవిర్భవానికి ముందు 298 గురుకుల విద్యాసంస్థలు ఉండగా, వాటిని ఒక వెయ్యి 30కి పెంచుకోవడం జరిగిందన్నారు.

కోట్లాది రూపాయల నిధులతో సకల వసతులు సమకూర్చుకొని కార్పోరేట్ విద్యా సంస్థలకు ధీటుగా విద్యా బోధన జరిగే విధంగా చర్యలు తీసుకున్నారన్నారు. విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యలతో గ్రామీణ ప్రాంతాల్లో పేద విద్యార్ధులు ఎందరికో ప్రయోజనం చేకూరుతుందన్నారు. ప్రతీ ఏటా గురుకుల విద్యా సంస్థల్లో ప్రవేశం కోసం పోటీ పెరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రమే ఎడ్యుకేషన్ హబ్ గా రూపుదిద్దుకున్నదని చెప్పుకొచ్చారు. దేశంలోని ఇతర రాష్ర్టాలన్నీ తెలంగాణ వైపు చూస్తున్నాయని చెప్పారు. మనఊరు మనబడితో ఎవరూ ఊహించనంతగా ప్రభుత్వ పాఠశాలలు రూపురేఖలు మార్చుకోగలిగామన్నారు. విద్యార్ధులకు నాణ్యమైన విద్య అందుతుందని మంత్రి చెప్పారు. ఇంగ్లీష్ మీడియంతో పాటు డిజిటల్ విద్యాబోధన అందించడంతో.. ప్రతి ఏటా ఉత్తీర్ణతా శాతం పెరుగుతుందన్నారు. పోటీ పరీక్షల్లో గురుకుల విద్యార్ధులు ప్రతిభ చాటుతూ తెలంగాణ ఖ్యాతిని దేశవ్యాప్తంగా తెలియజేస్తున్నారన్నారు. రెసిడెన్షియల్ స్కూల్స్ లో మంచి గైడ్ లైన్స్ పాటించడంతో 95 శాతం ఉత్తీర్ణత సాధించారని.. ఇది తెలంగాణ ప్రభుత్వం గొప్పతనమన్నారు. జాతీయ స్థాయిలో మూడు వేల మంది విద్యార్ధులకు వివిధ స్థాయిల్లో అవకాశం దక్కిందన్నారు. రాబోయే రోజుల్లో విద్యారంగంలో మరిన్ని విజయాలు తప్పక చేకూరుతాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement