Friday, May 3, 2024

Etala :బిజెపికి అధికారం ఇవ్వండి పేదల సొంతింటి కలను నెరవేరుస్తాం.. బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్

మక్తల్, నవంబర్22(ప్రభన్యూస్)
తెలంగాణలో బిజెపికి అధికారం అప్పగించండని రాష్ట్రంలో సొంత ఇంటి కోసం ఎదురు చూస్తున్న నిరుపేదల సొంత ఇంటి కలను తాము నెరవేరుస్తామని హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ అన్నారు. రెండు పడక గదుల ఇల్లు నిర్మించి ఇస్తామని గొప్పలు చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లలో పేదల సొంతింటి కలను కల్లలు చేసిందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో పేదలందరికీ సొంత ఇంటి కల నెరవేరుస్తామని, దగా పడ్డ దళితులకు 60 ,70 ఏళ్ల కింద పొందిన అసైండ్ భూములకు దళితులకే పూర్తి హక్కు బిజెపి ప్రభుత్వం కల్పిస్తుందని అన్నారు.

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం రోజు నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని ఎల్లమ్మ కుంట వద్ద జరిగిన ఎన్నికల ప్రచార సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మక్తల్ అసెంబ్లీ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి మాదిరెడ్డి జలంధర్ రెడ్డి, నారాయణపేట అసెంబ్లీ అభ్యర్థి కొత్తకాపు రతంగపాండు రెడ్డిలను ప్రజలకు పరిచయం చేసి బిజెపి అభ్యర్థుల కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ సభలో తెలంగాణ ప్రజానీకానికి స్పష్టమైన విన్నపం హామీ ఇచ్చారని తెలంగాణలో అధికారంలోకి వస్తే బిజెపి బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పడం జరిగిందని గుర్తు చేస్తూ బిజెపిని గెలిపిస్తే రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నట్లు ఈటెల రాజేందర్ వెల్లడించారు. రాష్ట్రంలో 11 శాతం జనాభా ఉన్న ముదిరాజులకు బిఆర్ఎస్ ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కూడా కేటాయించలేదని ముదిరాజుల సత్తా ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ కు చూపించాలని ఈటెల పిలుపునిచ్చారు .ఎస్సీ వర్గీకరణ చేపడతామని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇవ్వడం జరిగిందని అంటూ ఇచ్చిన హామీని నెరవేర్చడం బిజెపి బాధ్యతగా భావిస్తుందన్నారు. ఈ ఎన్నికల్లో దళితులంతా బిజెపికి అండగా నిలిచి బిజెపి ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ రింగ్ రోడ్డు చుట్టూ దళితుల అసైన్డ్ భూములను ల్యాండ్ పుల్లింగ్ పేరిట బెదిరించి ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం దళితుల నుండి భూములను లాక్కుందని ఆయన ధ్వజమెత్తారు. మూడు ఎకరాల భూమి దళితులకు ఇస్తామని చెప్పి వారికి ఉన్న అసైన్డ్ భూమిని కూడా లాక్కోవడం ఎక్కడి న్యాయమని ఆయన ప్రశ్నించారు. గజ్వేల్ ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటమి భయంతోనే దళిత బంధు పథకాన్ని తీసుకువచ్చి జమ్మికుంటలో రెండు లక్షల కోట్ల పంచేందుకు శ్రీకారం చుట్టారన్నారు. రెండు లక్షల కోట్ల దళిత బంధు పంపిణీ చేయాలంటే ఆర్థిక మంత్రిగా పనిచేసిన తన అనుభవం ప్రకారం 40 ఏళ్లు పడుతుందని ఈటెల రాజేందర్ తెలిపారు .40 ఏళ్లు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటాడా అని ఆయన ప్రశ్నించారు .వచ్చే నెలలో అవినీతి అసమర్థుడైన ముఖ్యమంత్రి కేసీఆర్ శాశ్వతంగా ఇంటికి వెళ్లడం ఖాయమని ఆ దిశగా తెలంగాణ ప్రజానీకం ఓటుతో బుద్ధి చెప్పనున్నారని అన్నారు. అటుకులు తిని ఉపవాసం ఉండి ఉద్యమాన్ని నడపనని చెప్పుకునే కేసీఆర్ కు వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుండి వచ్చాయని ఈటెల ప్రశ్నించారు. బంగారు తెలంగాణ లక్షమన్న కేసీఆర్ తన కుటుంబాన్ని మాత్రం బంగారు కుటుంబంగా మార్చుకుందని ఆయన ధ్వజమెత్తారు. పేదల కుటుంబాల్లో ఇద్దరు పిల్లలు చదువుకుంటే ఒక్కరికి కూడా ప్రభుత్వ ఉద్యోగం రాలేదని కానీ కెసిఆర్ కుటుంబంలో ఐదు మందికి పదవులు వచ్చాయని అన్నారు .బిజెపి తెలంగాణలో అధికారంలోకి వచ్చాక ఉద్యోగ క్యాలెండర్ ప్రకటిస్తుందని ఆయన వెల్లడించారు. పేదలందరికీ ఉచిత విద్య వైద్యం అందించడం బిజెపి ప్రధాన ఎజెండాగా ఆయన వెల్లడించారు .తెలంగాణకు అన్నం పెడుతున్న రాష్ట్ర రైతాంగం కౌలు రైతు చనిపోతే రూపాయి ఇవ్వలేని ముఖ్యమంత్రి కేసీఆర్ పంజాబ్లో చనిపోయిన రైతుకు ఎవడి అబ్బ సొమ్మని చెక్కులు పంచారు అని ఆయన ప్రశ్నించారు .బిఆర్ఎస్ పాలనలో రైతుల కష్టాలు అంతా ఇంతా కాదని ధాన్యం అమ్మపోతే సంచి వెంబడి 5 కిలోల తరుగు తీస్తున్నారని బిజెపి అధికారంలోకి వచ్చాక తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని 3100 మద్దతు ధర ఇస్తామని ఈటెల రాజేందర్ హామీ ఇచ్చారు. ప్రతి పేదవాడికి ఐదు లక్షల ఇన్సూరెన్స్ అమలు చేస్తామని చెప్పారు. 45 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తామంటూ అమలు కాని హామీలు ఇస్తూ ప్రజలను మభ్యపెడుతోందని అన్నారు .బిఆర్ఎస్ ,కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలకు మోసపోకుండా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం బిజెపికి అవకాశం ఇవ్వాలని ఈటెల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. అధికారంలోకి వచ్చాక మక్తల్ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని జీవో 69 అమలు చేసి ఊట్కూర్ నారాయణపేట ప్రాంతాలకు సాగునీరు అందిస్తామని ఈటెల రాజేందర్ హామీ ఇచ్చారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం తెలంగాణ అభివృద్ధి బిజెపితోనే సాధ్యమని ఎన్నికల్లో బిజెపిని భారీ మెజారిటీతో గెలిపించి రాష్ట్రంలో అధికారాన్ని అప్పగించాలని ఈటెల రాజేందర్ తెలంగాణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు .ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు నామాజీ ,కర్ణాటక కోలూరు లోక్సభ సభ్యులు ఎన్నికల ఇంచార్జ్ మునిస్వామి,కొండయ్య, నాయకులు పగడాకుల శ్రీనివాసులు, ఎం .భాస్కర్,కర్ని స్వామి, సోమశేఖర్ గౌడ్ ,బి. రాజశేఖర్ రెడ్డి, చిట్యాల లక్ష్మణ్, బాల్చేడ్ పావని మల్లికార్జున్,బి. అఖిల రాజశేఖర్ రెడ్డి, జి. బలరాం రెడ్డి, చీరాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement