Thursday, October 10, 2024

Gajwel – కాంగ్రెస్ గెలిస్తే మ‌ళ్లీ తెలంగాణ‌లో ఆకలి చావులే – కెసిఆర్

గ‌జ్వేల్ – సమైక్యవాదులు ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్రలు చేశారని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వస్తే మళ్లీ ఆకలి చావులేనని సీఎం హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం గజ్వేల్‌లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగిస్తూ.. గజ్వేల్‌లో మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామని, ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ వున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని కేసీఆర్ తెలిపారు. సంపద పెంచుతున్నాం.. పరిశ్రమలు విపరీతంగా తీసుకొచ్చామని సీఎం వెల్లడించారు. కాంగ్రెస్ పాలనలో వుంటే కర్ఫ్యూ వుండేదని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ ఆశగా, శ్వాసగా బతుకుతున్నానని కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. రైతుబంధును పుట్టించిందే కేసీఆర్ అని.. కాంగ్రెస్ వస్తే మళ్లీ ఆకలి చావులేనని ఆయన హెచ్చరించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే రైతుబంధు రూ.16 వేలకు పెంచుతామన్నారు కేసీఆర్. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే గజ్వేల్‌లో దళితులందరికీ ఒకే విడతలో దళితబంధు అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. గజ్వేల్‌కు ఐటీ టవర్ తెచ్చే బాధ్యత నాదేనని.. ఒక డజన్ కాలుష్య రహిత పరిశ్రమలు గజ్వేల్‌కు రాబోతున్నాయని కేసీఆర్ చెప్పారు. గజ్వేల్‌కు రైలు సదుపాయం కూడా వచ్చిందని సీఎం గుర్తుచేశారు. నరేంద్ర మోడీ ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తెలంగాణకు ఇవ్వలేదని , మన మీద కుట్రలు చేసే కేంద్రానికి మనం ఎందుకు సహకరించాలని కేసీఆర్ ప్రశ్నించారు.

రైతాంగం బాగు పడాలని వ్యవసాయ స్థిరీకరణకు పథకాలు చేపట్టామన్నారు. నాలుగు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు కడుతున్నామని.. నిమ్స్‌ను రెండు వేల పడకలతో అభివృద్ధి చేసుకుంటున్నామని చెప్పారు కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని దీక్ష చేశానని సీఎం గుర్తుచేశారు.

ప్రభుత్వం తన అధికారాన్ని రైతులకిచ్చిందని.. ధరణి పోర్టల్‌తో రైతుల భూములకు రక్షణ వచ్చిందని కేసీఆర్ తెలిపారు. నీటి తీరువా బకాయిలు రద్దు చేసి, ఉచితంగా నీటిని సరఫరా చేస్తున్నామని.. తెలంగాణ శాంతి భద్రతలకు ఆలవాలంగా వుందన్నారు. తెలంగాణ ఆచరిస్తే.. దేశమంతా అనుసరిస్తుందని, రైతుబంధు దుబారా చేస్తున్నారని ఉత్తమ్ అంటున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గెలిస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తామని కాంగ్రెస్ అంటోందని.. ఇందిరమ్మ రాజ్యంలో అన్నీ చీకటి రోజులేనని ఆయన ఎద్దేవా చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement