Monday, April 29, 2024

బీపీ, షుగర్ వ్యాధి గ్రస్తులకు ఇంటి వద్దకే ఉచిత‌ మందులు

హైద‌రాబాద్ – తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా చేపట్టిన నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ కిట్ల పంపిణీ అమలు చేస్తోంది. అందులో భాగంగా దీర్ఘ కాలిక వ్యాధులైన బీపీ, షుగర్ వ్యాధి గ్రస్తులకు ఇంటి వద్దకే మందులు అందించాలని డిసైడ్ అయింది. నేటి నుంచి హైదరాబాద్ జిల్లాలో ఈ విధానం అమల్లోకి వచ్చింది. రోగుల ఇళ్లవద్దకే వెళ్లి ఆశా వర్కర్లు ఎన్‌సీడీ కిట్స్‌ను పంపిణీ చేయటం ప్రారంభించారు. ఈ విధానం ద్వారా దీర్ఘ కాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారికి ప్రభుత్వం నుంచి ఉపశమనం లభిస్తోంది. షుగరు..బీపీ వంటి దీర్ఘకాలిక సమస్యలతో బాధ పడుతున్న వారికి ఈ కిట్లు పంపిణీ కొనసాగుతోంది. పంపిణీ ప్రక్రియను హైదరాబాద్‌ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ జె.వెంకటి పర్యవేక్షించారు. ఇప్పటికే కిట్లు చేరుకున్న పీహెచ్ సీ కేంద్రాలను పరిశీలించారు.కిట్లు అందుకున్న వారి ఇళల్కు వెళ్లి వారి అభిప్రాయాలను సేకరించారు. వారికి కిట్లను అందిస్తున్న విధానం పరిశీలించారు. మందులు అందిస్తున్న తీరు తో పాటుగా వాటి వినియోగం.. పని చేస్తున్న విధానం పైన ఆరా తీసారు. కిట్లు అందుకున్న వారు ఈ విధానం తమకు ప్రయోజనకరంగా ఉందని చెప్పుకొచ్చారు.


హైదరాబాద్ జిల్లాలో 16.42 లక్షల మందిని స్క్రీనింగ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. అందులో 1.96 లక్షల మంది బీపీ, 1.8 లక్షల మంది షుగరు వ్యాధి గ్రస్తులను గుర్తించారు. వీరికి ప్రతి నెలా ప్రత్యేకంగా సిద్దం చేసిన పౌచ్ లతో సిద్దం చేసిన బీపీ, షుగరు కిట్స్ ను ఇంటి వద్దకే వెళ్లి అందిస్తున్నారు. ఒక్కో వ్యాధి గ్రస్తుడికి నెలకు సరిపడా మందులతో ఈ కిట్లను అందిస్తున్నారు. వీటితో పాటుగా త్వరలోనే న్యూట్రీషన్‌ కిట్లను సైతం నగరంలో అందజేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గర్భిణుల డేటా సేకరణ, కిట్స్‌ పంపిణీ తదితర అంశాలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించడంలో నిమగ్నమయ్యారు.
ఇక పీహెచ్‌సీలకు ఇప్పటికే ఈ న్యూట్రీషన్‌ కిట్స్‌ చేరుకున్నాయి. వీటిని గర్భిణీలకు అందించనున్నారు. వీటి గురించి వారిలో అవగాహన పెంచుతున్నారు. ఫలితంగా తల్లులతో పాటుగా బిడ్డలకు ఈ కీలక సమయంలో బలమైన పోషకాలతో నిండిన న్యూట్రీషియన్ అందుతుంది. వీటిల్లో ఉండే బలవర్థక పోషకాలను స్వీకరించడం వల్ల గర్భిణులతో పాటు పుట్టబోయే బిడ్డ కూడా మరింత ఆరోగ్యంగా ఉంటారని అధికారులు వివరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement