Monday, April 29, 2024

జేఈఈ అడ్వాన్స్ డ్ ప‌రీక్ష‌లో హైటెక్ కాపీయింగ్ …న‌లుగురు విద్యార్ధులు అరెస్ట్

సికింద్రాబాద్ – ఐఐటీలలో బీటెక్ సీట్ల భర్తీకి నిర్వహించే జెఈఈ అడ్వాన్స్ డ్ ప్రవేశ పరీక్షలో కొంతమంది విద్యార్థులు స్మార్ట్ కాపీయింగ్ కు పాల్పడ్డారు. పరీక్షా కేంద్రాల్లోకి దొంగతనంగా స్మార్ట్ ఫోన్ తీసుకెళ్లి, ఒకరికొకరు జవాబు పత్రాన్ని వాట్సాప్ చేసుకున్నారు. హైస్కూలు, ఇంటర్ లో టాపర్ గా నిలిచిన ఓ విద్యార్థి తన స్నేహితుల కోసం స్మార్ట్ కాపీయింగ్ కు పాల్పడుతూ దొరికిపోయాడు. సికింద్రాబాద్ లోని ఎస్ వీఐటీ సెంటర్ లో ఈ నెల 4న జరిగిన జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షలో ఈ ఘటన చోటుచేసుకుంది.

వివ‌రాల‌లోకి వెళితే , కడప జిల్లాకు చెందిన చింతపల్లి చైతన్య కృష్ణ పదో తరగతితో పాటు ఇంటర్ లో కూడా టాపర్ గా నిలిచాడు. ఐఐటీలో సీటు కోసం జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షకు ప్రిపేరయ్యాడు. తనతో పాటు చదువుకున్న తన స్నేహితులకూ సీటు దక్కేలా సాయపడాలని అనుకున్నాడు. దీనికోసం నలుగురు కలిసి స్మార్ట్ కాపీయింగ్ కు ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా నలుగురూ సెల్ ఫోన్ ను దొంగతనంగా పరీక్షా కేంద్రంలోకి తీసుకెళ్లారు.

సికింద్రాబాద్ లోని ఎస్ వీఐటీ సెంటర్ లో పరీక్షకు హాజరైన చైతన్య తన జవాబు పత్రాన్ని వాట్సాప్ లో మిత్రులకు షేర్ చేశాడు. అయితే, చైతన్య మొబైల్ ఫోన్ వాడడం గమనించిన ఇన్విజిలేటర్ చైతన్యను పట్టుకుని ఉన్నతాధికారులకు అప్పగించాడు. నగరంలోని వేర్వేరు కేంద్రాలలో పరీక్ష రాస్తున్న చైతన్య మిత్రులు ముగ్గురిని కూడా గుర్తించి, పోలీసులకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement