Sunday, April 28, 2024

First Impression – రేవంతన్నంటే.. గిట్లనే చేస్తడు.. తొలి అడుగుల్లోనే .. జనం మదిలో జోష్

ప్రగతి భవన్లో ఇక స్వేచ్ఛ..

ప్రగతి భవన్ ఎదుటి గ్రిల్స్‌ను, బారీకేడ్స్‌ను తొలగించాలని రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయటం ఆలస్యం.. ప్రగతి భవన్ చుట్టూ ఇనుప కంచెల్ని తునాతునకలు చేశారు. కంచె కట్టును తొలగించారు. అంతే కాదు, ముందు రోడ్డు పక్కన షెడ్‌ను కూడా తీశారు. కారణమేమిటంటే.. సామాన్య ప్రజలు కూడా ప్రగతి భవన్‌లోకి చేరుకునే వీలు ఉండాలని, తమ కష్టం చెప్పుకోవాలని ఎన్నో మైళ్ల నుంచి ప్రగతి భవన్ వరకూ చేరే ప్రజలను.. ఇలా బారీకేడ్స్, గ్రిల్స్ తో అడ్డుకోవడం సమంజసం కాదనేది రేవంత్ రెడ్డి ఆలోచన . రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు తీసుకునే లోపునే ప్రగతి భవన్‌కు వెళ్లే లోపే ఆ గ్రిల్స్, బారీకేడ్స్ ను అధికారులు తీయించారు. అప్పట్లో సీఎం కేసీఆర్ ను కలవాలంటే అసాధ్యం. ఈ గేట్ల ఎదుటే జనం పడిగాపులు కాసేవాళ్లు .. సీఎం అపాయింట్ మెంట్ లేదని ఎందరో తిరుగుముఖం పట్టిన సందర్భాలు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో అలాంటి ఘటనలు మళ్లీ కనిపించవని చెబుతున్నారు.

ఇచ్చిన మాట మరవలే…

ఈ ఎన్నికల్లో మన పార్టీ గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నీకే మొట్టమొదటి ఉద్యోగం ఇస్తాం’ అంటూ కుమ్మకి రజనీ అనే దివ్యాంగ యువతికి దాదాపు రెండు నెలల కిందట రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన ఎన్నో సభల్లో మాట్లాడారు. ఎంతో బిజీబిజీగా గడిపారు. పార్టీని గెలిపించేందుకు విశ్రాంతి లేకుండా పనిచేశారు. అయినప్పటికీ ఆనాడు ఆ యువతికి ఇచ్చిన హామీని రేవంత్ రెడ్డి మర్చిపోలేదు. సీఎంగా ప్రమాణ స్వీకారం అనంతరం రజనికి ఉద్యోగ నియామక పత్రం అందజేశారు..

దివ్యాంగురాలికి బాసటగా…
‘నా వైకల్యమే నాకు శాపంగా మారింది. నాకున్న పరిమితులతో ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత లేదన్నారు. పోనీ ప్రైవేటు ఉద్యోగమూ దొరకలేదు. వెళ్లినా ఎవరూ జాబ్ లోకి తీసుక లేదు. ఎంతో కష్టపడి పీజీ చేశా.. మంచి మార్కులు సంపాదించ. ఉద్యోగం చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉందామనుకున్నా.. కడకు నేనే నా కుటుంబానికి భారంగా మారాను’ అంటూ రజనీ యువతి కన్నీటి కథకు రేవంత్ రెడ్డి చలించిపోయారు. మనసు కరిగిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి ఉద్యోగం నీదేనంటూ రెండు నెలల క్రితమే రజనీకి ఆయన హామీ ఇచ్చారు. ఆనాడు ఇచ్చిన మాటను గుర్తు చేసుకుని మరీ రజనీని తన ప్రమాణ స్వీకారానికి రేవంత్ రెడ్డి పిలిపించారు. ఆరు గ్యారెంటీల ఉత్తర్వులపై తొలి సంతకం చేసిన రేవంత్ రెడ్డి.. దివ్యాంగురాలు రజనీకి ఉద్యోగ నియామక పత్రంపై రెండో సంతకం చేశారు. అలా ఇచ్చిన హామీని నిలబెట్టుకుని దివ్యాంగురాలికి ఉద్యోగ నియామక పత్రం అందజేయటంతో.. రజని ఆనంద బాష్పాలు రాల్చింది. ఈ ఘటనతో కాంగ్రెస్ కార్యకర్తల్లోనే కాదు.. అశేష తెలంగాణ ప్రజల మదిలోనూ ఆనంద పరవశం పరవళ్లు తొక్కుతోంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement