Sunday, April 28, 2024

TS: అకాల వ‌ర్షాల‌తో అన్న‌దాత కుదేలు.. వెంట‌నే ఆదుకోవాల‌ని హరీష్ రావు విజ్ఞ‌ప్తి

హైద‌రాబాద్ – రైతులకు రూ.10వేలు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు కోరారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని ఎక్స్ వేదికగా ప్రభుత్వానికి విజ్ఞ‌ప్తి చేశారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి తదితర జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన అన్నదాతను అతలాకుతలం చేసింద‌న్నారు. పంటలు చేతికి రానున్న సమయంలో కురిసిన వడగండ్ల వాన రైతులకు కన్నీరు మిగిల్చిందని తెలిపారు.

వరి, మొక్కజొన్న, జొన్న పంటలతోపాటు బొప్పాయి, మామిడి సహా ఇతర ఉద్యాన పంటలు దెబ్బతినడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. గతంలో అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోతే, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వెళ్లి రైతులను పరామర్శించి భరోసా కల్పించార‌ని గుర్తు చేశారు. అక్కడికక్కడే ఎకరాకు రూ.10వేల నష్టపరిహారం ప్రకటించి అమలు చేశారని చెప్పారు. రెండు, మూడు రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నప్పటికీ, ప్రభుత్వం కనీసం స్పందించడం లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాజకీయాలు తప్ప, రైతు ప్రయోజనాలు పట్టని కాంగ్రెస్.. ఇప్పటికైనా మేల్కొని అన్నదాతకు అండగా నిలవాలని కోరారు. జరిగిన పంట నష్టాన్ని తక్షణమే అంచనా వేయడంతో పాటు, ఎకరాకు రూ. 10 వేల నష్ట పరిహారం చెల్లించాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు.

ఎన్నిగేట్లు తెరిచినా మాకేం కాదు .. జ‌గ‌దీష్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి గేట్లు తెరిచినా బీఆర్ఎస్‌కు ఏమీ కాదని అభిప్రాయపడ్డారు మాజీ మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి. తాము టికెట్లు ఇవ్వడానికి నిరాకరించిన వారినే కాంగ్రెస్‌, బీజేపీలో చేర్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మా వ‌ద్ద డిపెక్ట్ అయిన వాళ్ల‌నే చేర్చుకుంటున్నారని మండిప‌డ్డారు.. నేడు ఆయ‌న తెలంగాణ‌ భ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు వసూళ్లకే గాని పాలించడానికి పనికిరారని విమర్శించారు.

- Advertisement -

అధికారంలోకి వచ్చిన వంద రోజులుగా బీఆర్ఎస్‌పై విమర్శలకే పరిమితం అయ్యారన్నారు. ఆరు గ్యారంటీలు అమలు చేశామని గొప్పలు చెప్పుకోవడం కాదని.. అసలు ఒక్క గ్యారంటీ అయినా సక్రమంగా అమలు చేశారో లేదో చూసుకోవాలని హితవు పలికారు. వందరోజుల కాంగ్రెస్ పాలనకు లోక్ స‌భ ఎన్నికలు రెఫరెండంగా భావించాలన్నారు. వ్యవసాయ రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీస్తోందని మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement