Sunday, May 5, 2024

ఈ 6 నుంచి ఎంసెట్‌ ఫైనల్‌ షెడ్యూల్‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఇంజనీరింగ్‌ ఫైనల్‌ ఫేజ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను అధికారులు ప్రకటిం చారు. ఈ ఏడాదిలో ఇంజనీరింగ్‌ ప్రవేశాల్లో భాగంగా ఫైనల్‌ ఫేజ్‌ కౌన్సెలింగ్‌ ఈ నెల 6 నుంచి ప్రారంభించేందుకు అధికారులు నిర్ణయించారు. రాష్ట్రంలోని దాదాపు 175 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో కన్వీనర్‌ కోటాలో 74,071 సీట్లల్లో 60,941 సీట్లను ఎంసెట్‌ మొదటి విడత కౌన్సెలింగ్‌లో భర్తీ అయ్యాయి. మొదటి విడతలో సీటు పొందిన విద్యార్థులు తమ సీటును రద్దు చేసుకునేందుకు కూడా ఈనెల 5 వరకు అవకాశం కల్పించారు. దీంతో మరి కొన్ని సీట్లు కూడా మిగలనున్నాయి. అంతేకాకుండా రాష్ట్రంలోని 20 ఇంజనీరింగ్‌ కాలేజీలకు వివిధ కోర్సులకు సంబంధించి 5700 వరకు కొత్త సీట్లకు ప్రభుత్వం మంగళవారం అనుమతులిచ్చింది. దీంతో ఖాళీగా ఉన్న సీట్లతో పాటు విద్యార్థులు రద్దు చేసుకున్న సీట్లు, కొత్తగా అనుమతులిచ్చిన సీట్లను కలుపుకుని కన్వీనర్‌ కోటాలో దాదాపు 20వేల వరకు సీట్లు అందుబాటులో రానున్నాయి. వాటి భర్తీకి ఈ నెల 6 నుంచి ఫైనల్ ఫేజ్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌ను నిర్వహించ నున్నారు.

అఫిలియేషన్‌ తర్వాతే..

మొదటి కౌన్సెలింగ్‌ సీట్ల భర్తీ తర్వాత మిగిలిన 13,130 సీట్లు, సీట్లు రద్దు చేసుకోగా మిగిలిన మరికొన్ని సీట్లకు తొలుత అందుబాటులో పెట్టి కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. 20 కాలేజీల్లో కొత్తగా అందుబాటులోకి వచ్చిన 5700 సీట్లను మాత్రం ఆయా కాలేజీల అఫిలియేషన్‌ (గుర్తింపు) ప్రక్రియ పూర్తయిన తర్వాతే కౌన్సెలింగ్‌లో సీట్లను చూపిస్తామన్నారు. ఒకటి రెండ్రోజుల్లో ఈ కాలేజీలు అఫిలియేషన్‌ను పొందనున్నట్లు ఓ అధికారి తెలిపారు. ఇంజనీరింగ్‌ సీట్లు వృథా కాకుండా ఉండేందుకు ఈసారి స్పెషల్‌ రౌండ్‌ (మూడో దశ) కౌన్సెలింగ్‌ కూడా నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈనెల 20 నుంచి స్పెషల్‌ రౌండ్‌ కౌన్సెలింగ్‌ను నిర్వహించనున్నారు. అలాగే ప్రైవేట్‌ అన్‌ఎయిడెడ్‌ కాలేజీల్లో బీఈ, బీటెక్‌, బీఫార్మసీ కోర్సులకు స్పాట్‌ అడ్మిషన్‌ను సైతం మూడో దశ కౌన్సెలింగ్‌ తర్వాత చేపట్టనున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ఈనెల 25న వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు.
సీటు పొందిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.5వేలు, ఇతర అభ్యర్థులు రూ.10వేల కాషన్‌ ఫీజును కట్టాలని అధికారులు తెలిపారు. స్పెషల్‌ రౌండ్‌ కౌన్సెలింగ్‌ తర్వాత ఈ ఫీజును రీఫండ్‌ చేస్తామని పేర్కొన్నారు. సీట్లు వృథా కాకుండా ఉండేందుకే ఈ విధంగా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఇదీ..
-ఈనెల 6నుంచి 7 వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌, ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపు
-8 నుంచి 9 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌, వెబ్‌ఆప్షన్లు ఇచ్చుకోవడం
-12న సీట్ల కేటాయింపు
-12 నుంచి 15 వరకు ట్యూషన్‌ ఫీజు చెల్లింపు, వెబ్‌సైట్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌
-12 నుంచి 16 వరకు సీటు పొందిన కాలేజీల్లో రిపోర్టింగ్‌ చేయాలి
-18న ఫైనల్‌ ఫేజ్‌లో పొందిన సీట్లను రద్దు చేసుకునేందుకు గడువు
20 నుంచి స్పెషల్‌ రౌండ్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం
-20 నుంచి 21 వరకు వెబ్‌ ఆప్షన్‌ ఇచ్చుకోవాలి
-24న సీట్ల కేటాయింపు
-24 నుంచి 26 వరకు ట్యూషన్‌ ఫీజు చెల్లింపు, సీటు పొందిన కాలేజీల్లో ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌, కాలేజీల్లో నేరుగా రిపోర్ట్‌ చేయాలి
-26న స్పెషల్‌ రౌండ్‌లో కౌన్సెలింగ్‌లో సీట్ల రద్దు కు అవకాశం
-25న స్పాట్‌ అడ్మిషన్‌ మార్గదర్శకాలు విడుదల

Advertisement

తాజా వార్తలు

Advertisement