Wednesday, December 6, 2023

TS: ప్రతిపక్షాల మాయమాటలు నమ్మి మోసపోవద్దు… మంత్రి వేముల

ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రతిపక్షాల నేతలు మాయమాటలు చెప్తారని, వారి మాటలు నమ్మి మోసపోవద్దని రహదారులు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు.నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ పట్టాలను మంత్రి ప్రశాంత్ రెడ్డి అందజేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ… పడగల్ గ్రామాభివృద్ధి, సంక్షేమం కోసం 71కోట్ల రూపాయలు వెచ్చించామని రహదారులు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రజలకు వివరించారు. 14 ఏళ్లపాటు కేసీఆర్ ఏకైక లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ధీరుడని కొనియాడారు. ఉద్యమంలో రాజకీయ పార్టీల ఉద్దండులతో ఎన్నో ఇబ్బందులను ఎదురించి నాలుగు కోట్ల ప్రజానీకాన్ని ఏకం చేసి రాజకీయ పార్టీల మెడలు వంచి కేసీఆర్ తెలంగాణ సాధించారని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ సాధనతోనే నేడు గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున అందించగలుగుతున్నామన్నారు.

- Advertisement -
   

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేనన్ని సంక్షేమ పథకాలను తెలంగాణలో కేసీఆర్ అమలు పరుస్తున్నారని, కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకునే మహత్తరమైన శక్తి అని అన్నారు. ఎన్నికల సమయం ఆసన్నం కావడంతో ఎన్నో రాజకీయ పార్టీల నాయకులు గ్రామాల్లో తిరుగుతూ ఏదో చేస్తామని ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి కోరారు. డబుల్ బెడ్రూమ్ పథకం రాష్ట్రంలో అమలు చేసినప్పుడు ఎంతోమంది అపహాస్యం చేశారని నేడు కొంత ఆలస్యమైనా రాష్ట్రమంతటా డబుల్ బెడ్రూములు నిర్మించామని, వాటి ఫలాలు నేడు పేదలకు అందుతున్నాయన్నారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా నిరుపేదలైన ఎంతోమంది ఆడబిడ్డల వివాహాలకు డబ్బులను అందించడం జరుగుతుందన్నారు.

దేశంలో ఏ ప్రభుత్వం సాహసించలేని బీడీ కార్మికులకు పెన్షన్ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేసి తీరిందని మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాలేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి నేడు రివర్స్ పంపింగ్ ద్వారా పోచంపాడు ప్రాజెక్టులకు కూడా నీటిని తీసుకురావడం జరిగిందన్నారు. ఒక పడగల్ గ్రామంలోనే 16కోట్ల 19 లక్షల రూపాయలు పెన్షన్ రూపేనా లబ్ధిదారులకు ఇప్పటివరకు అందించడం జరిగిందన్నారు. పడగల్ గ్రామంలో 187మందికి షాదీ ముబారక్ నూట యాభై రెండు మందికి అనారోగ్యం పాలైనప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ ను అందించామన్నారు. నేడు గ్రామంలో 96మందికి డబుల్ బెడ్రూమ్ పట్టాలను అందించామని మంత్రి స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో బాల్కొండ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి బాటలో నడిపిస్తానని, ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చే నాయకులను నమ్మి మోసపోవద్దని, మోసపోతే ప్రజలే నష్టపోతారని మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రజలకు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement