Tuesday, May 7, 2024

ADB: కాంగ్రెస్ ఖాతాలో ఖానాపూర్‌.. బిఆర్ఎస్ చేజారిన మునిసిపాలిటీ…

నిర్మల్ జిల్లా ఖానాపూర్: బీఅర్ఎస్ పార్టీకి చెందిన ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, వైస్ చైర్మన్ అబ్దుల్ ఖలీల్ ల పై పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. మున్సిపల్ కార్యాలయంలో సోమవారం 9 మంది కౌన్సిలర్లు అవిశ్వాసానికి మద్దతు తెలిపినట్లు నిర్మల్ ఆర్డీవో మున్సిపల్ ప్రత్యేక అధికారి రత్న కళ్యాణి తెలిపారు. గత మూడు నెలలుగా క్యాంపు రాజకీయాల అనంతరం సోమవారం అవిశ్వాస సమావేశం నిర్వహించారు. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాసానికి మద్దతుగా గత నెల 5న బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, స్వతంత్ర పార్టీలకు చెందిన 9మంది కౌన్సిలర్లు నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆశిష్ కు నోటీసులు ఇచ్చారు.

వీరి నోటీసుల అనంతరం కలెక్టర్ జనవరి 12న, ఫిబ్రవరి 5న అవిశ్వాస నోటీసుపై ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు నోటీసులు జారీచేశారు. ఈ మేరకు ప్రత్యేక సమావేశ నిర్వహణ బాధ్యతలు నిర్మల్ ఆర్డీవో రత్న కళ్యాణికి అప్పగించడంతో ఆమె సోమవారం సమావేశం నిర్వహించారు. చైర్మన్ కు వ్యతిరేకంగా బీఅర్ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు, కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు కౌన్సిలర్లు, బీజేపీకి చెందిన ఒక్కరు, స్వతంత్ర అభ్యర్థి ఒక్కరు ఓటు వేయడంతో అవిశ్వాసం నెగ్గింది. అవిశ్వాస ప్రక్రియ నివేదికను కలెక్టర్ కు అందజేస్తామని ఆర్డీవో తెలిపారు. కాగా కొత్త మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ గా ఎవరిని ఎన్నుకుంటారన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఖానాపూర్ మున్సిపల్ పరిధిలో ఎలాంటి సంఘటనలు జరగకుండా ఎస్సై లింబాద్రి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ తహసిల్దార్ మంజుల మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement