Monday, April 29, 2024

విద్య, వైద్య రంగాల అభివృద్ధికి పెద్దపీట : గంగుల కమలాకర్‌

హైదరాబాద్‌, ప్రభన్యూస్ : విద్య, వైద్య రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. బడుగు బలహీన వర్గాలకు నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలను మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో 9123 పాఠశాలలు ఆధునీకరిస్తున్నట్లు ఆయన చెప్పారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకే ”మన ఊరు – మన బడి” కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం చేపట్టిందన్నారు. బుధవారం కరీంనగర్‌ జిల్లా తీగల గుట్టపల్లిలో ”మన ఊరు – మనబడి” కార్యక్రమాన్ని మంత్రి కమలాకర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 74 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్ర పాలనలో కేవలం 16 గురుకుల పాఠశాలలు ఉండేవని, వాటిలో 9వేల మంది విద్యార్థులే విద్యను అభ్యసించేవారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు సంవత్సరాల్లో 281 గురుకులాలు స్థాపించి ఒక లక్ష 35 వేల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు తెలిపారు.

ఉన్నత వర్గాలకు ధీటుగా నిరుపేత విద్యార్థులకు గురుకులాల ద్వారా నాణ్యమైన విద్యను అందజేస్తున్నామని ఆయన వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలు దేవాలయాలు లాంటివని రాజకీయాలకు అతీతంగా విద్యాలయాలను అభివృద్ధి చేయాలని మంత్రి కమలాకర్‌ పిలుపునిచ్చారు. విద్యాలయాలు, ఆస్పత్రులను అభివృద్ధి చేయాలనే సీఎం కేసీఆర్‌ ఆశయానికి అనుగుణంగా పని చేయాలని ఆయన కోరారు. తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని పేదలు తాపత్రయపడుతున్నారని అన్నారు. పేద పిల్లలు విద్యను అభ్యసించే విధంగా ప్రభుత్వ పాఠశాలలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామన్నారు. పాఠశాలల అభివృద్ధికి డొనేషన్లు ఇచ్చేందుకు ముందుకువచ్చే వారిని ప్రోత్సహిస్తామన్నారు. ఎవరైనా కోటి రూపాయలు విరాళం ఇస్తే వారి పేరు ఆ పాఠశాలకు పెడతామన్నారు. రూ.10 లక్షలు విరాళం ఇస్తే తరగతి గదికి, రూ.2 లక్షలు విరాళం ఇస్తే స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీలో సభ్యుడిగా నమోదు చేసుకునే ఆవకాశం కల్పిస్తామని మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. కరీంనగర్‌ జిల్లాలో ఏదైనా ఒక పాఠశాలకు వాడుకునే విధంగా తన సోదరుడు పేరిట రూ.20 లక్షలు విరాళం ఇస్తున్నట్లు మంత్రి కమలాకర్‌ ప్రకటించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement