Thursday, April 25, 2024

దెబ్బ‌తిన్న పైప్‌లైన్లు, భగీరథ నీటి సరఫరాలో అంతరాయం.. వెంట‌నే స‌రిచేయాల‌న్న ఎర్ర‌బెల్లి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు జిల్లాలోని గ్రామాల్లో మిషన్‌ భగీరథ నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడింది. అదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, భద్రాది కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, మంచిర్యాల, నల్గొండ, నిర్మల్‌ జిల్లాలో 2,222 గ్రామాల్లో మిషన్‌ భగీరథ మంచినీటి సరఫరాకు తీవ్ర ఆటంకం కలిగింది. దీంతో ఆయా గ్రామాలకు మంచినీటి సరఫరా ఆగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఆదేశించారు. వరదల కారణంగా ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లతో పాటు సంబంధిత శాఖల అధికారులకు ఆయన సూచించారు.

బుధవారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయం నుంచి అన్ని జిల్లాల అధికారులతో మంత్రి ఎర్రబెల్లి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్‌ శాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, కమిషనర్‌ హనుమంతరావు తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. వరద నష్టం అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. వర్షం నీటి కోతకు దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని సూచించారు. పంచాయతీరాజ్‌ రోడ్ల సమస్యల పరిష్కారం కోసం టోల్‌ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని, సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలన్నారు. ఆ దిశగా క్షేత్రస్థాయిలో జిల్లా పరిషత్‌ సీఈవోలు, డీపీవోలు, ఎంపిడీవోలు,ఎంపీవోలు, గ్రామ కార్యదర్శులను అప్రమత్తం చేయాలని కలెక్టర్లను ఆయన ఆదేశించారు.

ఇదిలావుండగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని భారీ వర్షాల పరిస్థితిపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఆరా తీశారు. జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆయన కోరారు. రోడ్లపై నీరు అధికంగా ప్రవసిస్తుంటే ముందే బ్లాక్‌ చేయాలన్నారు. తాత్కాలికంగా ఆ ప్రాంతాల్లో విద్యుత్‌ను నిలిపివేసి నష్టాన్ని నివారించాలన్నారు. గోదావరి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున ఏ విధమైన ఆస్తి నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ములుగు జిల్లా కలెక్టర్‌ను మంత్రి ఎర్రబెల్లి ఆదేశించారు. వరద నష్టాలను ఎప్పటికప్పుడు తెలుసుకుని నివారణ చర్యలు చేపట్టే దిశగా వరంగల్‌ జిల్లా కలక్టరేట్‌, నగరపాలక సంస్థ కార్యాలయంలో టోల్‌ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేయాలన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement