Sunday, July 14, 2024

Counter – సింగ‌రేణికి రేవంత్ బొంద పెడుడుతున్నారు – కెటిఆర్

హైద‌రాబాద్ : తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ సింగ‌రేణిని తొమ్మిదిన్న‌రేండ్లు కాపాడితే.. ఇప్పుడు రేవంత్ రెడ్డి బీజేపీతో క‌లిసి బొంద పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిప‌డ్డారు. సింగ‌రేణి మెడ‌పై కేంద్రం క‌త్తి పెట్టింది. కేంద్రం పెట్టిన క‌త్తికి కాంగ్రెస్ సాన‌బెడుతోంది. వేలం పాట‌ను ఉప‌సంహ‌రించుకోవాల‌ని కేంద్రాన్ని కోరుతున్నాం అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో ఆయ‌న నేడు మీడియాతో మాట్లాడుతూ, బీఆర్ఎస్ 16 ఎంపీ సీట్లు గెలిస్తే ఏం చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారని… కానీ ఈరోజు ఏపీలో 16 స్థానాలు గెలిచిన టీడీపీ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపగలిగిందని అన్నారు. 16 ఎంపీ సీట్లు వస్తే కేంద్రంలో మనం నిర్ణయాత్మకంగా ఉంటామని కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. ఈరోజు బీఆర్ఎస్‌కు లోక్ సభ స్థానాలు వస్తే కేంద్రంలో నిర్ణయాత్మక స్థానంలో ఉండేవారమన్నారు. కానీ ప్రస్తుతం తెలంగాణలో బీజేపీకి 8, కాంగ్రెస్‌కు 8 లోక్ సభ స్థానాలు ఉన్నాయని గుర్తు చేశారు.

బొగ్గు గనులను వేలం పెట్టవద్దని నాడు పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి లేఖ రాశారన్నారు. కానీ ఇప్పుడు బొగ్గు గనుల వేలంలో సింగరేణి పాల్గొనాలని కిషన్ రెడ్డి చెబితే… రేవంత్ రెడ్డి పాల్గొంటానని ఎందుకు చెబుతున్నారని ప్రశ్నించారు. వేలం లేకుండా సింగరేణికి గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. గతంలో ఒడిశాలో రెండు గనులను నైవేలీ లిగ్నైట్ కంపెనీకి, గుజరాత్‌లోని గనులను అక్కడి ప్రభుత్వరంగ సంస్థలకు వేలం లేకుండా కేటాయించారని గుర్తు చేశారు. తమిళనాడులోనూ ప్రభుత్వరంగ సంస్థలకు వేలం లేకుండా కేటాయించారన్నారు.

- Advertisement -

లోక్ స‌భ‌లో బిఆర్ఎస్ లేక‌పోవ‌డంతోనే ..

తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ పార్టీ ఒక ర‌క్ష‌ణ క‌వ‌చం, శ్రీరామ‌ర‌క్ష అని కేసీఆర్ ఈ 25 ఏండ్ల‌లో ఒక్క‌సారి కాదు వేల సార్లు చెప్పారు. కానీ ఇవాళ ఏం జ‌రిగింది. కేసీఆర్ 16 పార్ల‌మెంట్ సీట్లు ఇవ్వండి అని మొత్తుకున్నారు. కేంద్రంలో నిర్ణ‌యాత్మ‌క పాత్ర‌లో ఉంటామ‌ని చెప్పారు. 16 ఎంపీల‌తో ఏం చేస్తార‌ని సీఎం రేవంత్ రెడ్డితో స‌హా చాలా మంది చాలా మాట్లాడారు. కానీ ఇవాళ ఏపీలో 16 ఎంపీ సీట్లు గెలిచిన తెలుగు దేశం పార్టీ నిర్ణ‌యాత్మ‌క పాత్ర‌లో ఉంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్ర‌యివేటీక‌ర‌ణ ఆగిపోయింది. కానీ ప్ర‌స్తుతం రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌కు చెరో 8 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఈ 16 మంది ఎంపీల‌ను గెలిపిస్తే ఇవాళ హైద‌రాబాద్‌లో బొగ్గు గ‌నుల‌ను వేలం వేస్తున్న‌ట్లు బ‌హిరంగంగా ప్ర‌క‌టించార‌ని కేటీఆర్ తెలిపారు.

సింగ‌రేణిని కాపాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్ర‌మే
కేంద్రం మా మెడ మీద క‌త్తి పెట్టినా బొగ్గు గ‌నుల‌ను వేలం వేయ‌కుండా చూశాం. తొమ్మిదిన్న‌రేండ్లు సింగ‌రేణిని కాపాడుకున్నాం. సింగ‌రేణి లాభ‌ప‌డితే మ‌న రాష్ట్రానికి లాభం జ‌రుగుతుంది. కార్మికులు లాభ‌ప‌డుతారు. సింగ‌రేణి కార్మికులు జంగ్ సైర‌న్ ఊదితే ద‌క్షిణ భార‌త‌దేశం అంధ‌కారంలోకి వెళ్లిన‌ ప‌రిస్థితి. ఎప్పటికైనా సింగ‌రేణిని కాపాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్ర‌మే. మ‌న గ‌నుల్లో మ‌నం బొగ్గు త‌వ్వుకోకుండా అడ్డుకోవ‌డం దుర్మార్గం. సింగ‌రేణి కార్మికులు అన్నీ అర్థం చేసుకోవాలి. సింగ‌రేణి బొగ్గు బ్లాకుల‌ను కార్పొరేట్ గ‌ద్ద‌ల‌కు క‌ట్ట‌బెట్ట‌డాన్ని ఖండిస్తున్నాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ఖ‌తం చేసిన‌ట్టే సింగ‌రేణిని ఖ‌తం చేస్తారు. కాంగ్రెస్, బీజేపీకి చెరో 8 సీట్లు ఇచ్చినందుకు సింగ‌రేణిని నాశ‌నం చేస్తున్నారు. ఇక్క‌డి ప్ర‌భుత్వ చేత‌గానిత‌నం వ‌ల్లే మ‌న‌కు క్యాప్టివ్ మైన్స్ ఇవ్వ‌డం లేదు. కాంగ్రెస్, బీజేపీలు క‌లిసి దోపిడీకి తెర తీశాయి. కేసీఆర్ ఆనాడు బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొన‌లేదు. బీఆర్ఎస్ లోక్‌స‌భ‌లో లేదు కాబ‌ట్టే ఇవాళ సింగ‌రేణి గ‌నుల‌ను వేలం వేస్తున్నారు. 2021లో కేంద్రానికి లేఖ రాసిన రేవంత్ ఇప్పుడెందుకు మారిపోయాడు. రేవంత్ రెడ్డికి కేసుల భ‌యం ప‌ట్టుకుందా..? సింగ‌రేణిని బొంద‌పెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. బీజేపీ నిర్ణ‌యానికి కాంగ్రెస్ ఎందుకు వంత పాడుతోంది. రేపు వేలం పాట‌లో డిప్యూటీ సీఎం ఎందుకు పాల్గొంటున్నారు. సింగ‌రేణి మెడ‌పై కేంద్రం క‌త్తి పెట్టింది. కేంద్రం పెట్టిన క‌త్తికి కాంగ్రెస్ సాన‌బెడుతోంది. వేలం పాట‌ను ఉప‌సంహ‌రించుకోవాల‌ని కేంద్రాన్ని కోరుతున్నాం అని కేటీఆర్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement