Saturday, June 29, 2024

Congress – సీఎం రేవంత్‌ ఢిల్లీ టూర్‌ – ఆశావాహుల్లో హుషార్‌

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ప్ర‌తినిధి, హైద‌రాబాద్‌: ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ ప్రాధాన్యం సంత‌రించుకుంది. తెలంగాణ పీఠాన్ని అధిరోహించిన త‌ర్వాత మూడు నెల‌ల‌కే ఎన్నిక‌ల కోడ్ రావడంతో ఇటు మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌, అటు నామినేట్ ప‌ద‌వుల పంప‌కం జ‌ర‌గ‌లేదు. ఎన్నిక‌ల కోడ్ ముగిసిన వెంట‌నే రేవంత్‌ పాల‌న‌పై కేంద్రీక‌రించారు. ఇందులో భాగంగా సీనియ‌ర్ ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారుల ప్ర‌క్షాళ‌న‌కు దృష్టి సారించారు. త్వ‌ర‌లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో త‌మ స‌త్తా నిరూపించుకోవ‌లంటే పార్టీలో కూడా ప్ర‌క్షాళ‌న జ‌ర‌గాలి. ఇప్ప‌టికే కొంత మంది సీనియ‌ర్లు మంత్రి ప‌ద‌వులు, పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి, నామినేట్ ప‌ద‌వుల కోసం అధిష్థానం వ‌ద్ద పైర‌వీలు చేస్తున్నారు. అలాగే ఎన్నిక‌ల స‌మ‌యంలో కూడా కొంద‌రికి ప‌ద‌వులు ఇస్తాన‌ని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. ఈ నేప‌థ్యంలో రేవంత్ ఒక జాబితా రెడీ చేసుకోగా.. అధిష్ఠానం వ‌ద్ద కూడా మ‌రో జాబితా ఉంద‌ని తెలుస్తోంది. దీనిపై హై క‌మాండ్ సూచ‌న మేర‌కు ఎవ‌రెవ‌రికి మంత్రి ప‌ద‌వులు, పార్టీ ప‌ద‌వులు, కార్పొరేట్ ప‌ద‌వులు ఇవ్వాలో నిర్ణ‌యించ‌నున్నారు.

అధిష్ఠానంతో చ‌ర్చ‌లు..

తెలంగాణ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ విజ‌యం, తాజా రాజ‌కీయ ప‌రిణామాలు, ఇంత‌ర అంశాల‌పై అధిష్ఠానంతో చ‌ర్చిస్తారు. సీడ‌బ్ల్యూసీ స‌మావేశంలో పాల్గొన్నారు. అలాగే సోనియాతో భేటీ అవుతారు. అలాగే కాంగ్రెస్ అగ్ర‌నేత‌ల‌తో కూడా స‌మావేశ‌మ‌వుతారు. ఈ సంద‌ర్భంగా మంత్రివ‌ర్గ వి స్త‌ర‌ణ‌, కార్పొరేష‌న్‌ ప‌ద‌వులపై చ‌ర్చిస్తారు.

- Advertisement -

పీసీసీ ప‌ద‌వి…

ప్ర‌స్తుతం సీఎం రేవంత్ రెడ్డి వ‌ద్ద పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి కూడా ఉంది. ముఖ్య‌మంత్రిగా రేవంత్ రెడ్డి ప్ర‌మాణాస్వీకారం అయిన వెంట‌నే పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి వేరే వారికి క‌ట్ట‌బెడ‌తార‌ని అనుకున్నారు. ఇంత‌లో లోక్‌స‌భ ఎన్నిక‌లు రావ‌డంతో పీసీసీ ప‌ద‌వి రేవంత్ రెడ్డి ద‌గ్గ‌ర ఉండిపోయింది. ఇప్పుడు పీసీసీ ప‌ద‌వి వేరే వారికి ఇవ్వ‌నున్నారు. పీసీసీ ప‌ద‌వికి ఆశావాహుల సంఖ్య కూడా ఎక్కువ‌గా ఉంటుంది. అధిష్ఠానం ద‌గ్గ‌ర కొంత మంది పేర్లు ప‌రిశీల‌న ఉండగా, సీఎం రేవంత్ రెడ్డి కూడా కొంత మంది పేర్లు అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డికి అనుకూల‌మైన వారికి పీసీసీ ప‌ద‌వి ఇప్పించ‌డంలో కీల‌క‌పాత్ర పోషిస్తున్నారు.

పీసీసీ ప‌ద‌వి కోసం పైర‌వీలు

రేవంత్ రెడ్డి స‌ర్కార్‌లో మంత్రివ‌ర్గంలో చోటు ద‌క్క‌ని సీనియ‌ర్లు పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌విపై క‌న్ను వేసి అటు అధిష్టానం వ‌ద్ద ఇటు ముఖ్య‌మంత్రి వ‌ద్ద పైర‌వీలు సాగిస్తున్నారు.

ఎన్నిక‌ల్లో మెజార్టీ ప‌రిగ‌ణ‌న‌

ఇటీవ‌ల జ‌రిగిన లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పార్టీ మెజార్టీ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని ప‌ద‌వులు ఇచ్చే అవ‌కాశం ఉందని చ‌ర్చ జ‌రుగుతుంది. అవ‌కాశం ఉన్న మంత్రి ప‌ద‌వులు ఇవ్వ‌గా, మ‌రికొంద‌రికి కార్పొరేష‌న్ ప‌ద‌వులు ఇస్తారు. శాస‌న‌స‌భ ఎన్నిక‌ల స‌మ‌యంలో కొంద‌రిని బుజ్జగించ‌డం కోసం పీసీసీ అధ్య‌క్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి కార్పొరేష‌న్ ప‌ద‌వులు ఇవ్వ‌డానికి హామీలు కూడా ఇచ్చారు. వీటి అన్నింటిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని ప‌ద‌వులు పంచే అవ‌కాశం ఉంది.

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల దృష్ట్యా…

త్వ‌ర‌లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు రానున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని కూడా కొంద‌రికి కార్పొరేష‌న్ ప‌ద‌వులు ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement