Saturday, May 4, 2024

రిజ‌ర్వ్ డ్ సీట్ల‌లో ప‌ట్టు కోసం కాంగ్రెస్ మేథోమ‌ధ‌నం…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటి నుంచే చర్యలు మొదలు పెట్టింది. వివిధ ప్రజా సమస్యలపైన ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న కాంగ్రెస్‌.. ఆయా వర్గాలు, కులాలను వారిగా ఓట్లను ఒడిసిపట్టుకునేందుకు ప్రయత్నాలు చేపట్టింది. కాంగ్రెస్‌ పార్టీకి మొదటి నుంచి సంప్రదాయంగా ఉన్న దళిత, గిరిజనుల ఓటు బ్యాంకు కాపాడుకునేందుకు హస్తం పార్టీ నేతలు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ దళిత బంధు, పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తామని చెబుతూనే మరో వైపు రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ది 125 అడుగుల భారీ విగ్రహాన్ని ఆవిష్కరించి.. ఆ వర్గాలను ఓట్లను కొల్లగొట్టాలనే ఆలోచనతో ఉన్నారు. అందుకు ధీటుగా కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్లాలనే యోచనలో ఉన్నారు. దళిత బంధు కంటే మెరుగైన పథకం దళిత, గిరిజన వర్గాల కోసం తీసుకుకొచ్చేందుకు ఇప్పటి నుంచే చర్చిస్తున్నారు. అందుకు మేధావులు, విశ్రాంత ఐఏఎస్‌, ఇతర ఉన్నతాధికారులతో కాంగ్రెస్‌ నేతలు సమావేశాలు నిర్వహించి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. ఒక వైపు ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీల్లో అమలు కానీ అంశాలన ప్రస్తావిస్తూనే.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాగానే చేపట్టే పనులు ప్రజలకు క్షేత్ర స్థాయిలో తీసుకెళ్లాలనే యోచనలో కాంగ్రెస్‌ నేతలు ఉన్నారు.

ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు స్థానాలపైన దృష్టి
రాష్ట్రంలో ఎస్సీ రిజర్వుడు అసెంబ్లి నియోజక వర్గాలు 19, ఎస్టీ రిజర్వుడు స్థానాలు 11 నియోజక వర్గాలు ఉన్నాయి. అయితే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 19 స్థానాలు గెలుచుకోగా.. అందులో ఎస్సీ, ఎస్టీ నియోజక వర్గాలే ఎక్కువగా ఉన్నాయి. ఎన్నికల తర్వాత జరిగిన పరిమాణాలతో చాలా మంది ఎమ్మెల్యేలు అధికార బీఆర్‌ఎస్‌లో చేరారు. అందులో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. రిజర్వుడు స్థానాల్లో బీఆర్‌ఎస్‌ ధీటుగా బలమైన నాయకులను వచ్చే ఎన్నికల్లో ఎంపిక చేయాలనే ఆలోచనతో ఉన్నారు. ఎస్పీ రిజర్వుడ్‌ స్థానాల్లో ఆందోల్‌, జహీరా బాద్‌, చెన్నూరు, బెల్లంపల్లి, జుక్కల్‌, చొప్పదండి, మానకొండూర్‌, ధర్మపురి, వర్ధన్నపేట, స్టేషన్‌ఘన్‌పూర్‌, మధిర, సత్తుపల్లి, తుంగతూరి, నకిరేకల్‌, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌, అచ్చంపేట, అలంపూర్‌, వికారాబాద్‌, చేవెళ్ల నియోజక వర్గాలున్నాయి.

ఎస్సీ రిజర్వుడ్‌ స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి దాదాపు బలమైన నాయకులే ఉన్నారు. ఎస్టీ రిజర్వుడ్‌ స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ బలంగానే ఉందని చెబుతున్నారు. ఎస్టీ రిజర్వుడ్‌లో 11 స్థానాలు (మహబూ బాద్‌, ములుగు, పినపాక, వైరా, భద్రాచలం, అసిఫాబాద్‌, ఖానాపూర్‌, బోథ్‌, ఇల్లెందు, అశ్వరావుపేట, దేవరకొండ) ఉండగా, వాటిలో ఖమ్మం జిల్లాలోనే 5 నియోజక వర్గాలున్నాయి. ఉమ్మడి అదిలాబాద్‌లో 3 నియోజక వర్గాలు, వరంగల్‌లో రెండు స్థానాలు ఉండగా నల్లగొండలో ఒక నియోజక వర్గం ఉంది. ఈ 11 నియోజక వర్గాల్లో 5 స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది. ఖమ్మంలో 4 నియోజక వర్గాల్లో కాంగ్రెస్‌, పొత్తులో భాగంగా రెండు చోట్ల టీడీపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కొందరు ఎమ్మెల్యేలు అధికార బీఆర్‌ఎస్‌లో చేరారు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీని మరింత బలోపేతం చేసుకుని రిజర్వుడ్‌ స్థానాల్లో మెజార్టీ సీట్లను కైవసం చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement