Friday, May 17, 2024

సర్కారు ఆసుపత్రుల్లో మందుల కొరతకు చెక్‌.. ఉచిత మందుల సంఖ్యను పెంచిన ప్రభుత్వం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరతకు చెక్‌ పడనుంది. సర్కారు వైద్యం కోసం వచ్చే పేద, సామాన్య రోగులకు ఉచితంగా అందించే మందుల సంఖ్యను తెలంగాణ ప్రభుత్వం గణనీయంగా పెంచింది. ఇప్పటి వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో 720 రకాల మందులను రోగులకు ఉచితంగా అందిస్తున్నారు. ఇకమీదట ఉచితంగా అందించే మందుల జాబితాలోని ఔషధాల సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వం 843కు పెంచింది. ఇందులో ఈఎంఎల్‌ జాబితాలో 311, ఏఎంఎల్‌ జాబితాలో 532 మందులు ఉన్నాయి. కొత్తగా 123 రకాల మందులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 6 మందుల్లో ఒకటి కొత్త జాబితాలో చేర్చిందే. రానున్న రోజుల్లో బ్రెయిన్‌ ట్యూమర్‌, న్యూరాలజీ, ఆర్థోపెడిక్‌ తదితర ఖరీదైన మందులను కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన టెండర్లు ఖరారు చేయడంలో టీఎస్‌ఎం ఐడీసీ అధికారులు నిమగ్నమయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులను మందులు లేవన్న కారణంతో ప్రయివేటు మెడికల్‌ షాపులకు పంపొద్దని సర్కారు వైద్యులను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి హరీష్‌రావు ఆదేశించారు. ప్ర భుత్వం అందిస్తున్న ఉచిత మందుల జాబితాను విధుల్లో ఉన్న ప్రతి వైద్యుడికి అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. ఇందుకు మందుల జాబితాతో ప్రత్యేకంగా బుక్‌లెట్‌ ఇవ్వనున్నారు.

దీని ప్రకారం వైద్యులు జనరిక్‌ మెడిసిన్‌నే సూచించాలని, బ్రాండెడ్‌ మందులు రాయొద్దని మంత్రి హరీష్‌ఱావు ఆదేశాలు జారీ చేశారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల సంఖ్యను మరింత పెంచేందుకు మంత్రి హరీష్‌రావు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఆసుపత్రులకు కావాల్సిన మందుల ఇండెంట్‌ను తీసుకోవడంపై టీఎస్‌ఎంఐడీసీ ప్రత్యేక దృష్టి సారించింది. సమీక్షా సమావేశాల్లో మందుల కొరత ఉందంటున్న ఆసుపత్రుల సూపరిండెంట్లు…సకాలంలో టీఎస్‌ఎంఐడీసీకి ఇండెంట్‌ పెట్టడంలో మాత్రం వైఫల్యం చెందుతున్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో టీఎస్‌ ఎంఐడీసీ ఉన్నతాధికారులు ప్రతి బోధనాసుపత్రిని సందర్శించి అక్కడి సూపరిండెంట్లతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. అవసరం ఉన్న మందుల వివరాలను పంపితే సకాలంలో సరఫరా చేసేందుకు టీఎస్‌ఎంఐడీసీ సిద్ధంగా ఉందని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు చాలా వరకు ప్రభుత్వ, బోధానాసుపత్రులు ప్రజలకు ఎక్కువగా అవసరం అయ్యే మందులు కాకుండా తలనొప్పి తదితర చిన్న చిన్నరోగాల మందులను పెద్ద ఎత్తున స్టాక్‌ ఉంచుతున్నారు. దీంతో దీర్ఘకాలం బాధించే వ్యాధులకు మందులను సకాలంలో రోగులకు ఉచితంగా అందించడంలో నిధుల సమస్యతోపాటు జాప్యం కూడా చోటు చేసుకుంటోంది. ఈ పరిస్థితుల్లో ఈ-ఔషధి పోర్టల్‌ను పక్కాగా అమల్లోకి తీసుకురావాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. అవసరమున్న మందుల వివరాలతో మూడు నెలల ముందుగానే టీఎస్‌ఎంఐడీసీకి ఇండెంట్‌ వచ్చేలా చర్యలు తీసుకుంటోంది. ప్రతి ఔషధం కనీసం మూడు నెలల వరకు తగినంత స్టాక్‌ అందుబాటులో ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు టీఎస్‌ఎంఐడీసీ చెబుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement