Wednesday, May 15, 2024

రెండున్నరేళ్లయినా పోస్టింగుల్లేవ్‌.. జాబ్​ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఉద్యోగాల భర్తీకి నియామక ప్రకటన జారీ చేసింది 2019 నవంబర్‌లో అయితే…రాత పరీక్ష నిర్వహిచిందేమో 2019 డిసెంబర్‌ 23న. అలాగే ఫలితాలను ప్రకటించి మెరిట్‌ ర్యాంకులను ఇచ్చిందేమో 2020 జనవరి 7న. ఇంతటితోనే విద్యాశాఖ చేతులు దులిపేసుకుంది. ఆ తర్వాత అర్హులైన అభ్యర్థులకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా ఫలితాలు ప్రకటించిన కాన్నుంచి దాదాపు మూడేళ్లు కావొస్తున్నా ఇంత వరకూ ఆ ఊసే ఎత్తడంలేదు. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని సమగ్ర శిక్షా అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ)లో డీఈవో, ఎంఈవో కార్యాలయాల్లో కాంట్రాక్టు (ఒప్పంద) విధానంలో మొత్తం 704 ఖాళీల భర్తీకి 2019 నవంబర్‌లో పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం 704 ఖాళీల్లో మేనేజ్‌మెంట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌(ఎంఐఎస్‌) కోఆర్డినేటర్లు 144, డేటా ఎంట్రీ ఆపరేటర్లు 138, సమీకృత విద్యా రిసోర్స్‌ పర్సన్లు (ఐఈఆర్‌పీ) 383, సిస్టమ్‌ అనలిస్ట్‌ 12, అసిస్టెంట్‌ ప్రోగ్రామర్లు 27 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు దాదాపు అన్ని జిల్లాల నుంచి దరఖాస్తులు అందాయి. వీరికి 2019 డిసెంబర్‌ 23న రాత పరీక్షను నిర్వహించారు.

2020 జనవరి 7న ఫలితాలను ప్రకటించి జిల్లాల వారీగా ర్యాంకులు, మెరిట్‌ కూడా ఇచ్చారు. 2020 మార్చి నుంచి కరోనా కేసులు నమోదుకావడం, రాష్ట్రంలో ప్రతికూల పరిస్థితులు తలెత్తడం జరిగింది. కరోనా కారణంగా పాఠశాలలను తెరవకపోవడంతో నియామకాలు చేపట్టకుండా నియామక పక్రియను పక్కనపెట్టేశారు. ఆ తర్వాత కరోనా వైరస్‌ తీవ్రత రాష్ట్రంలో తగ్గడం.. సాధారణ పరిస్థితులు ఏర్పడటంతో ఈ ఏడాది మార్చిలో 704 ఉద్యోగాల నియామకాలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆమోదం తెలిపారు. దీంతో పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన మార్చి 9వ తేదీన నియమాక ప్రక్రియను ప్రారంభించాలని జిల్లా విద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా మొత్తం నియామక ప్రక్రియను అదేనెల 17వ తేదీ నాటికి పూర్తి చేయాలని రాష్ట్రంలోని అన్ని జిల్లా విద్యాధికారులను సైతం ఆదేశాలు జారీ చేశారు. కానీ నేటి వరకూ రాష్ట్రంలోని ఏ ఒక్క జిల్లాలో కూడా నియామక ప్రక్రియ మొదలు పెట్టలేదని అభ్యర్థులు చెబుతున్నారు. 704 పోస్టుల్లోని 5 విభాగాలకు సంబంధించి ర్యాంకులు పొందిన అభ్యర్థులు సుమారుగా గత మూడేళ్లుగా ఈ ఉద్యోగాల కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల చుట్టూ వారు ప్రదిక్షణలు చేస్తూ వినతి పత్రాలు ఇస్తున్నారు. కానీ ఇంత వరకు వారికి న్యాయం జరగనేలేదు. మండలాల వారీగా విద్యార్థుల వివరాల నమోదు చేసేందుకు ఎంఐఎస్‌ కోఆర్డినేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్ల సేవలు కావాల్సిందే. వివరాల నమోదు కోసం ఖాళీల భర్తీ చేపట్టిన విద్యాశాఖ అభ్యర్థులకు పోస్టింగులు ఇవ్వకపోవడంతో పాఠశాలల్లో చేరిన విద్యార్థుల వివరాలు విద్యాశాఖకు చేరటంలో జాప్యం జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement