Tuesday, May 7, 2024

హైదరాబాద్‌లో ‘కాల్‌అవే గోల్ప్’.. డిజిటెక్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనున్న ప్రీమియం గోల్ఫ్‌ కంపెనీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణలో పెట్టుబడుల వరదపారించేందుకు అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్‌ ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలతో విజయవంతంగా చర్చలు జరుపుతున్నారు. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సోమవారం కెమ్‌ వేద ఫార్మస్యూటికల్‌ కంపెనీ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కాగా, 3.2బిలియన్ల డాలర్ల వార్షిక రెవెన్యూ గల ప్రపంచ ప్రఖ్యాత కాల్‌అవే గోల్ఫ్‌ కంపెనీ హైదరాబాద్‌లో డిజిటెక్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అమెరికాలోని సాన్‌డియాగోలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్‌తో ఆ కంపెనీ ప్రముఖులు బ్రియాన్‌ లించ్‌, సీఐవో సాయి కొర్రపాటి చర్చలు జరిపారు. హైదరాబాద్‌లో ఏర్పాటుచేయనున్న డిజిటెక్‌ సెంటర్‌లో 300 మంది సాప్ట్‌వేర్‌ నిపుణులకు ఉపాధి లభించనుంది.

ఈ కేంద్రం డేటా అనలిటిక్స్‌తోపాటు ఆ కంపెనీ గ్లోబల్‌ ఆపరేషన్స్‌కు ఐటీ బ్యాకెండ్‌ సపోర్ట్‌ను అందించనుంది. కాగా, ఈ సమావేశంలో తెలంగాణలో స్పోర్ట్స్‌, టూరిజం, తయారీలాంటి తదితర రంగాల్లో ప్రభుత్వంతో కలిసి పనిచేసే సహకార అవకాశాలపై చర్చించారు. డిజిటెక్‌ సెంటర్‌ ఏర్పాటుకోసం దేశంలోని వివిధ నగరాలను పరిశీలించిన కాల్‌అవే కంపెనీ, చివరగా హైదరాబాద్‌ను ఎంచుకోవడం విశేషం. కాల్‌అవే గోల్ఫ్‌ కంపెనీ ప్రీమియమ్‌ కంపెనీ కావడం విశేషం. కాల్‌అవే గోల్ఫ్‌, ఒడిస్సీ, ఓజియో, ట్రావిస్‌ మాథ్యూ,జాక్‌ వోల్ఫ్‌ స్కిన్‌ అనేవి కాల్‌అవే గోల్ఫ్‌ కంపెనీ బ్రాండ్‌లుగా ఉన్నాయి.

ధన్యవాదాలు తెలిపిన మంత్రి కేటీఆర్‌…

హైదరాబాద్‌ నగరంలో ఇప్పటికే అనేక రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌లతో పాటు ఐటీ, టెక్‌ కేంద్రాలను అనేక కంపెనీలు ఏర్పాటు చేసిన విషయాన్ని ప్రస్తావించిన మంత్రి కేటీఆర్‌, గోల్ఫ్‌ క్రీడ ఆధారిత వినూత్న టెక్నాలజీసెంటర్‌ ఏర్పాటు చేయడం పట్ల కంపెనీకి ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికే ఫైనాన్స్‌, బ్యాంకింగ్‌, ఫార్మా, ఐటీ రంగాల టెక్నాలజీ సెంటర్‌లు హైదరాబాద్‌లో ఉన్నాయని కాల్‌ వే కంపెనీ ప్రకటన తర్వాత అనేక ఇతర క్రీడలకు సంబంధించిన టెక్నాలజీ కేంద్రాలు ఏర్పాటు అవుతాయన్న ఆశాభావాన్ని మంత్రి కేటీఆర్‌ వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement