హైదరాబాద్, ఆంధ్రప్రభ : రోనున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 10కిపైగా ఎంపీ స్థానాలను గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ అందుకోసం 38 కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రత్యేకంగా పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ కమిటీ సమావేశం నిర్వహించి ఈ కమిటీలను వేసింది. తెలంగాణలోని అన్ని ఎంపీ స్థానాలు గెలవడమే తమ లక్ష్యమని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో ఓటు శాతాన్ని మరింత పెంచుకునేందుకు రాష్ట్ర పార్టీ పక్కా ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా సభలు, సమావేశాలు, రోడ్ షోలు, ప్రజాహిత యాత్రలు, విజయ సంకల్ప యాత్రలు ప్లాన్ చేసింది. తాజాగా నియమించిన 38 ఎన్నికల కమిటీలు రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం, సభలు సమావేశాలు, మేనిఫెస్టో, ఛార్జిషీట్ తదితర విధులను నిర్వహించనున్నాయి.
పార్టీ తెలంగాణ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నియమితులయ్యారు. ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్‌గా ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్‌కు బాధ్యతలు అప్పగించారు. ఈ కమిటీకి కో కన్వీనర్లుగా ఏపిఎస్‌రెడ్డి, గరికపాటి, రామచందర్‌రావులను నియమించారు. మరోవైపు ఎన్నికల కార్యాలయం ప్రముఖ్‌గా రంగారెడ్డి, సహ ప్రముఖ్‌గా మాధవి నియమితులయ్యారు.
ఎన్నికల మేనిఫెస్టో కమిటీ ప్రముఖ్‌గా ఎంపీ లక్ష్మణ్‌కు మరో బాధ్యతను అప్పగించిన అధిష్టానం, పార్టీ చార్జిషీట్ కమిటీ ప్రముఖ్‌గా సీనియర్ నాయకుడు మురళీధర్‌రావుకు బాధ్యతలు అప్పగించింది. మీడియా కమిటీ ప్రముఖ్‌గా కృష్ణ సాగర్‌రావు, మీడియా రిలేషన్స్ కమిటీ ప్రముఖీగా ప్రకాష్‌రెడ్డి, సోషల్ మీడియా కమిటీకి పోరెడ్డి కిషోర్‌రెడ్డి, ఎన్నికల కమిషన్, లీగల్ ఇష్యూస్ కమిటీ ప్రముఖ్ ఆంథోసి రెడ్డిని నియమించింది.