Wednesday, May 15, 2024

BJP Campaign – కాంగ్రెస్ అభ్య‌ర్ధులు గెలిచినా బిఆర్ఎస్ లోకే దూకేస్తారు….అమిత్ షా

మ‌క్త‌ల్ – కాంగ్రెస్ అభ్య‌ర్ధులు గెలిచిన ఆ త‌ర్వాత వారంతా బిఆర్ఎస్ పార్టీలోకి చేరిపోతార‌ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు.. అందుకు నిబంద‌త క‌లిగిన బిజెపి అభ్య‌ర్దులను గెలిపించాల‌ని తెలంతాణ ఓట‌ర్ల‌కు పిలుపు ఇచ్చారు.. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మక్తల్‌లో బీజేపీ నిర్వహించిన సంకల్ప సభలో అమిత్ షా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ను ఇంటికి పంపే సమయం వచ్చిందని బీజేపీ అగ్రనేత, కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు.బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని విమర్శలు గుప్పించారు. ద‌ళిత బంధు నిధులు బిఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల జేబుల‌లోకి వెళితే, ప్రాజెక్ట్ ల సొమ్ము కెసిఆర్ ఖ‌జ‌నాల‌కు చేరిందంటూ విమ‌ర్శించారు. . లిక్కర్, గ్రానైట్, మియాపూర్ భూములు, ఓఆర్ఆర్ ఇలా ఈ ప్రభుత్వంలో ఎన్నో కుంభకోణాలు జరిగాయని అన్నారు. పదేళ్ల పాలనలో అవినీతి తప్ప కేసీఆర్ ప్రభుత్వం చేసిందేమీ లేదని అమిత్ షా విమర్శించారు. 1,200 మంది బలిదానాలతో తెలంగాణ ఏర్పడితే… రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. మిగులు ఆదాయం ఉన్న తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టేశారని అన్నారు. లక్ష రుణ మాఫీ చేయలేదని, నిరుద్యోగ భృతి ఇవ్వలేదని, ఉద్యోగాలను భర్తీ చేయలేదని విమర్శించారు.

ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తానన్న కేసీఆర్ ఆ హామీని నిలుపుకోలేదని అమిత్ షా విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు ఎన్నికల ముందు వేర్వేరు కండువాలతో వస్తారని ఎన్నికలయ్యాక కలిసిపోతారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినా బీఆర్ఎస్, ఎంఐఎంలకు ఓటు వేసినట్టేనని చెప్పారు. కేసీఆర్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మండిపడ్డారు. దీంతో కేసీఆర్ విశ్వసనీయత కోల్పోయారని అన్నారు. సినిమా, ఫార్మా, ఎడ్యుకేషన్ సిటీలని ఏర్పాటు చేస్తానని చేయలేదన్నారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎప్పుడూ వారసుల గురించే ఆలోచిస్తాయని ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలోకి రాగానే అందరిని జైలుకు పంపిస్తామన్నారు. తెలంగాణలో బీసీ అభ్యర్థిని సీఎంగా ప్రకటించిన ఏకైక పార్టీ బీజేపీ అని అన్నారు. బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement