Monday, April 29, 2024

60 శాతం సీట్లు బిసిల‌కు కేటాయిచండి – బిసి సంక్షేమ సంఘం డిమాండ్

సిరిసిల్ల, ఆగస్టు 24 (ప్రభన్యూస్) : రానున్న అసెంబ్లీ ఎన్నికలలో బీసీలకు అన్యాయం చేస్తే సహించబోమని, అన్ని పార్టీలు జనాభా థామాషా ప్రకారం బీసీలకు సీట్లు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పరీక్ష హనుమాన్లు డిమాండ్ చేశారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వీర వేణి మల్లేష్ యాదవ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ ల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీ సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బీసీలకు అన్యాయం చేస్తే సహించేది లేదన్నారు. బీసీలకు 50 శాతం సీట్లు అన్ని రాజకీయ పార్టీలు కేటాయించవలసిందేనని అన్నారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన జాబితాలో బీసీలకు కేవలం 23 సీట్లు కేటాయించడం పట్ల బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఖండిస్తున్నట్లు పర్శ హన్మాండ్లు తెలిపారు.

బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన జాబితాను వెంటనే సవరించి, బీసీలకు 50 శాతం టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 60 శాతo ఉన్న బీసీలకు 20 శాతం, 10 శాతం జనాభా ఉన్న అగ్రవర్ణాలకు 60 శాతం సీట్లు కేటాయించడం శోచనీయమన్నారు. బీసీలలో 136 కులాలు ఉంటే కేవలం ఐదు కులాలకే టికెట్లు ఇచ్చారని, మిగిలిన కులాల పరిస్థితి ఏమిటని పర్శ హన్మాండ్లు ప్రశ్నించారు. గతంలో బీఆర్ఎస్ 25 మంది బీసీలకు టికెట్ కేటాయించిందని, ఇప్పుడు ఉన్న దానిలో హుజురాబాద్, కామారెడ్డి బీసీ టికెట్లకు కోత పెట్టడం సమంజసం కాదన్నారు.

బీసీలకు సామాజిక న్యాయం దక్కే వరకు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. బారాస పార్టీ ప్రకటించిన జాబితాను వెంటనే సవరించి బీసీలకు న్యాయం చేయాలని పర్శ హాన్మాండ్లు సందర్భంగా డిమాండ్ చేశారు. సెప్టెంబర్ మొదటి వారం వరకు రాజకీయ పార్టీల వైఖరిని చూస్తామని, అప్పటివరకు మార్పులు చేర్పులు చేసి బీసీలకు న్యాయం చేస్తే సరేనని లేని పక్షంలో హైదరాబాదులో సెప్టెంబర్ 10 న ఐదు లక్షల మందితో బీసీ సింహగర్జన పెడతామని, ఆ రోజే రాజకీయ పార్టీల వైఖరిపై కార్యాచరణ ప్రకటిస్తామని పర్శ హన్మాండ్లు ఈ సందర్భంగా తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వీరవేణి మల్లేష్ యాదవ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కో ఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్, నాయకులు కందుకూరి రామాగౌడ్, కమలాకర్, కంచర్ల రాజు, చొక్కి కైలాస్, రుద్రవేని సుజిత్, నవీన్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement