Friday, May 3, 2024

HYD: బండ్లగూడ జాగీర్ హస్తగతం.. మేయర్ పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం

డిప్యూటీ మేయర్ వర్గానిదే పైచేయి
ఆయన వెంట 16 మంది కార్పొరేటర్లు
మేయర్ వెంట నలుగురు కార్పొరేటర్లే
అవిశ్వాసంపై ‘ఆంధప్రభ’ చెప్పిందే నిజం
తొలినుంచి కథనాలుఅందించిన ఆంధ్రప్రభ
ఫలించిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి వ్యూహం
తెరవెనుక నడిపించిన తీన్మార్ మల్లన్న

మణికొండ, మార్చి 21(ప్రభ న్యూస్): హైదరాబాద్ లో కీలక ప్రాంతంగా మారిన బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ లో అవిశ్వాసం అంకం గురువారంతో ముగిసింది. ముందు నుంచి ‘ఆంధ్రప్రభ’ చెప్పిందే నిజమైంది. మేయర్ మహేందర్ గౌడ్ పై 16మంది కార్పొరేటర్లు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. డిప్యూటీ మేయర్ పూలపల్లి రాజేందర్ రెడ్డి వర్గానిదే పైచేయి అయింది.

పంతం నెగ్గింది..
బండ్లగూడ జాగీర్ బీఆర్ఎస్ ఆధీనంలో ఉంది. రాష్ట్రంలో ప్రభుత్వం మారి.. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఇక్కడ కూడా పరిణామాలు మారిపోయాయి. మేయర్ పనితీరుపై వ్యతిరేకత, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలో చేరితే ప్రగతి పనులు చేపట్టేందుకు పార్టీ మార్పు తప్పదని అత్యధిక శాతం కార్పొరేటర్ల అభిప్రాయం. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం చురుగ్గా వ్యవహరించింది. జాగీర్ అసమ్మతి కార్పొరేటర్లకు అండగా నిలిచింది.


పూలపల్లి పెద్ద పాత్ర..
జాగీర్ కార్పొరేషన్ లో అవిశ్వాసం వెనుక డిప్యూటీ మేయర్ పూలపల్లి రాజేందర్ రెడ్డి క్రియాశీలక పాత్ర పోషించారు. రోజుల తరబడి క్యాంపు నిర్వహణను పర్యవేక్షించారు. చివరకు అవిశ్వాసం నెగ్గే వరకు ఆయన తెరవెనుక ఉండి కథ నడిపించారు. వాస్తవానికి గత నెల 22నే అవిశ్వాసంపై ఓటింగ్ జరగాల్సి ఉంది. కానీ, మేయర్ మహేందర్ గౌడ్ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. అనంతరం నలుగురు కార్పొరేటర్లతో కలిసి కాంగ్రెస్ లో చేరారు. ఈ నేపథ్యంలో ఆయన పదవికి వచ్చిన ముప్పేమీ లేదని భావించారు. అయినా కూడా ఆయనను ఎట్టి పరిస్థితుల్లొనూ దించేయాలన్న మెజారిటీ కార్పొరేటర్ల పంతం నెగ్గింది.

- Advertisement -


అటు రంజిత్ రెడ్డి.. ఇటు తీన్మార్ మల్లన్న
జాగీర్ కార్పొరేషన్ హస్తగతం కావడం వెనుక చేవెళ్ల ఎంపీ జి.రంజిత్ రెడ్డి కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది. ఆయన బీఆర్ఎస్ లో ఉన్నప్పుడే జాగీర్ కార్పొరేషన్ కార్పొరేటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గారు. ఇటీవల ఎంపీ కూడా కాంగ్రెస్ లోనే చేరడంతో కథ సుఖాంతమైంది. ఇక అవిశ్వాసంలో మరో కీలక పాత్రధారి తీన్మార్ మల్లన్న. అసమ్మతి కార్పొరేటర్లు కాంగ్రెస్ గూటికి చేరేలా మల్లన్న వ్యూహం పన్నారు.

ఆంధ్రప్రభ కథనాలు అక్షర సత్యం..
జాగీర్ కార్పొరేషన్ లో అవిశ్వాసానికి చాలా అవాంతరాలు ఎదురయ్యాయి. ఓ దశలో సాంకేతిక కారణాలతో అవిశ్వాసాన్ని వీగిపోయేలా చేసే ప్రయత్నం జరిగింది. ఈ పరిణామాలపై ఎప్పటికప్పుడు ‘ఆంధ్రప్రభ’ కథనాలు ప్రచురించింది. జాగీర్ లో అవిశ్వాసాన్ని అడ్డుకుంటున్న శక్తి ఎవరు? అని నిలదీసింది. దీంతో అవిశ్వాస తీర్మానం అనేక మలుపులు తిరిగింది. ఈ గురువారం చివరకు ఓటింగ్ వరకు వచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement