Sunday, April 28, 2024

Assembly: కృష్ణా జ‌లాల‌ను ఎపి అప్ప‌గించింది కెసిఆరే – మంత్రి ఉత్త‌మ్

కృష్ణా జలాల వినియోగంలో, వాటాలో, హక్కుల గురించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో సోమవారం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. గడచిన పదేండ్లలో సాగునీటి విష‌యంలో జ‌రిగిన వివ‌రాల‌ను వివరించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కృష్ణానది ప్రాజెక్టులు, కేఆర్‌ఎంబీ సంబంధిత అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది.

అంతకుముందు ‘కృష్ణా ప్రాజెక్టులపై వాస్తవాలు.. భారాస ప్రభుత్వ తప్పిదాలు’ పేరుతో నోట్ విడుదల చేసింది. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో ఆ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించింది. కేసీఆర్ పాలనలో జరిగిన తప్పుడు విధానాలే.. ఇప్పుడు తెలంగాణకు శాపాలయ్యాయని పేర్కొంది. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించే ప్రసక్తే లేదని.. రాష్ట్రానికి దక్కాల్సిన వాటా కోసం కృషి చేస్తామని స్పష్టం చేసింది.

- Advertisement -

అనంత‌రం ఎమ్మెల్యేలందరికీ వాస్తవాలను తెలియజేసేలా డిజిటల్ స్క్రీన్‌లను ఏర్పాటు చేసి ఉమ్మడి రాష్ట్రం నుంచీ చోటుచేసుకున్న పరిణామాలను వివరించారు. రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నీటి విషయంలోనూ రాజీపడిందని, ఏపీ జల దోపిడీకి ఉద్దేశపూర్వకంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతి ఇచ్చారని లెక్కలతో సహా వివరించారు. గత ప్రభుత్వ నిర్ణయాలతో జరిగిన జల దోపిడీని అడ్డుకునేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని చెప్పారు.
కావాలనే అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీకి కేసీఆర్‌ వెళ్లలేదు..
రాయలసీమ లిఫ్ట్‌ పూర్తయితే రోజుకు 8 టీఎంసీల నీటిని ఏపీ తరలిస్తుంద‌ని వివ‌రించారు. ఆ లిఫ్ట్‌ టెండర్లు పూర్తయ్యాకే కేసీఆర్‌ కేంద్రానికి లేఖ రాశార‌ని, పరోక్షంగా సహకరించార‌ని పేర్కొన్నారు. కావాలనే కెసిఆర్ అపెక్స్‌ కౌన్సిల్ భేటీకి హాజరుకాలేద‌న్నారు. సమావేశానికి వెళ్లి అభ్యంతరం తెలిపితే రాయలసీమ లిఫ్ట్‌ ఆగేద‌న్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని భారాస ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింద‌న్నారు. 2013లోనే ప్రాజెక్టు మొదలైనా, ఇప్పటికీ పనులు పూర్తిచేయలేద‌ని వివ‌రించారు.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రాజెక్టుల అప్పగింతపై ఏ నిర్ణయమూ తీసుకోలేద‌న్నారు. కేసీఆర్‌ ఓడిపోబోతున్నారనే అప్పుడు సాగర్ పైకి జగన్‌ పోలీసులను పంపినట్లు అనిపిస్తోంద‌ని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement