Monday, May 6, 2024

Andhra Prabha Effect .. మర్రి కబ్జాపై కలెక్టర్ ఫోకస్

చిన్నదామెర చెరువు కబ్జాలను నిశితంగా పరిశీలించిన కలెక్టర్
చెరువుల ఆక్రమణపై సీరియస్
అన్ని నిర్మాణ అనుమతులను పునః పరిశీలించండి
ఎఫ్టీఎల్, బఫర్‌లో నిర్మించిన అనుమతులు ర‌ద్దు చేయాల‌ని హెచ్ఎండీఏకు లేఖ
జలవనరుల కబ్జాలపై ఉక్కు పాదం మోపుతాం: మేడ్చల్ కలెక్టర్ గౌతమ్

ఆంధ్రప్రభ వెలుగులోకి తెచ్చిన ప్రతి అక్షరం అక్షర సత్యమేనని తేలింది. ఇప్పటికే హైకోర్టు ఆదేశాలతో దుండిగల్ చిన్నదామెర చెరువును డిప్యూటీ సోలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పరిశీలించగా.. తాజాగా మేడ్చల్ కలెక్టర్ గౌతమ్ త‌న సిబ్బందితో క‌ద‌లివ‌చ్చారు. మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ రెడ్డి దుండిగల్‌లోని చిన్నదామెర చెరువు ఎఫ్టీఎల్, బఫర్‌లోని 8-24 ఎకరాలను ఆక్రమించారు. దీనిపై అధికార యంత్రాంగం మంగళవారం మధ్యాహ్నం నిశితంగా పరిశీలించారు..

కుత్బుల్లాపూర్, (ప్రభ న్యూస్):
దుండిగల్‌ మున్సిపల్ పరిధిలోని చిన్నదామెర చెరువు సర్వే నెంబర్ 405 తోపాటు మరికొన్ని సర్వే నెంబర్‌లు ఉండగా..! ఎఫ్‌టిఎల్‌ బఫర్ జోన్‌లో సర్వే నెంబర్.484, 483, 486, 488, 489, 492 తో మొత్తం 148 ఎకరాలు ఉన్నట్లు ఇరిగేషన్, రెవెన్యూ రికార్డు ల ప్రకారం అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కాగా చిన్నదామెర చెరువుకు ఎఫ్టిఎల్( ఫుల్ ట్యాంక్ లెవల్ ) 100 ఎకరాలకు పైగా ఉంది.. ప్రస్తుతం చిన్నదామెర చెరువు ఎఫ్ టి ఎల్ పూర్తిగా కబ్జాలతో కుంచించుకుపోయింది. మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కి చెందిన ఐఏఆర్ఇ అండ్ యంఎల్ఆర్ఐటియం కళాశాల భవనాలు ఎఫ్టిఎల్, బఫర్ లో 8-24 ఎకరాలను ఆక్రమించుకుని అందులో శాశ్వత భవనాలు, తాత్కాలిక భవనాలు, పార్కింగ్ షెడ్లు, బస్ పార్కింగ్, ఫుట్బాల్ క్రీడా మైదానం ఇలా ఇష్టారాజ్యంగా చెరువును ఆక్రమించి చెరువు ఉనికినే ప్రశ్నార్ధకం చేశారు. ఇలా చిన్నదామెర చెరువును మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి చెరబట్టారు.. దీనిపై ఆంధ్ర ప్రభ మంగళవారం కబ్జాల మర్రి అనే శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురించగా మేడ్చల్-మల్కాజిగిరి కలెక్టర్ గౌతమ్ రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు, సిబ్బందితో పరిశీలించి వాస్తవ పరిస్థితులను పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్యామ్ ప్రకాష్, దుండిగల్ గండిమైసమ్మ తహసీల్దార్ సయ్యద్ మతీన్,ఆర్ఐ భారతి,సర్వేయర్ సునీత, ఇరిగేషన్ ఏఈఈ సారా, దుండిగల్ మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ, టీపీఎస్ సిబ్బంది తిరుపతి పాల్గొన్నారు..

నిర్మాణాల రద్దుకు హెచ్ఎండీఏకు లేఖ: గౌతమ్ కలెక్టర్

చిన్నదామెర చెరువు ఎఫ్ టి ఎల్, బఫర్ లో ఐఏఆర్ఇ మరియు ఎంఎల్ఆర్ఐటియం యాజమాన్యం శాశ్వత, తాత్కాలిక నిర్మాణాలతో పాటు పార్కింగ్ షెడ్లు, బస్ పార్కింగ్ స్థలాలు, క్రీడా మైదానం ఇలా పెద్ద ఎత్తున అక్రమించుకున్నట్లు తెలుస్తుంది.. దీనిపై ఇరిగేషన్, రెవెన్యూ,మున్సిపల్ అధికారుల తో కలిసి పరిశీలించాం. చెరువును ఆక్రమించుకున్నట్లు హెచ్ ఎం డి ఏ లెక్స్ డొమైన్ లో పొందు పేర్చిన లెక్స్ ప్రిలిమినరి నోటిఫికేషన్ ఆధారంగా స్పష్టమౌతుంది. ఇదే విషయాన్ని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు స్పష్టం చేస్తున్నారు. పూర్తి నివేదికలు తెప్పించుకుని చిన్న దామెర చెరువులోని ఆక్రమణలను తొలగిస్తాం. నిర్మాణ అనుమతుల రద్దుకు హెచ్ ఎం డి ఏ కు లేఖ రాస్తాం. అంతేకాక గతంలో అంటే గ్రామ పంచాయతీ సమయంలో తీసుకున్న నిర్మాణ అనుమతులను పునః పరిశీలిస్తం. వాటర్ బాడీ లో ఎలాంటి నిర్మాణాలను ఉపేక్షించేది లేదు.. ఇరిగేషన్,రెవెన్యూ చట్టం ప్రకారం ఐఏఆర్ఇ .. ఎంఎల్ఆర్ఐటియం కచ్చితంగా చర్యలు తీసుకుంటాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement