Sunday, April 28, 2024

TS: మ‌హిళ‌లకు 33 శాతం రిజ‌ర్వేష‌న్ ఇచ్చే వ‌ర‌కు ఆగ‌దీ పోరాటం… ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్‌: అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ధర్నా చేయాల్సి రావడం సిగ్గుచేటని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సంతోషంగా సంబురాలు చేసుకునే ఉమెన్స్‌ డే రోజున ఆడ‌బిడ్డల ఉద్యోగాల‌కై ధ‌ర్నాలు చేసే దౌర్భాగ్యపు స్థితిని ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకొచ్చిందని విమర్శించారు. బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ మహిళలకు అనేక హక్కులు కల్పించారని చెప్పారు. ప్రభుత్వ నియామకాల్లో మహిళలకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఇవాళ హైదరాబాద్‌ ధర్నా చౌక్‌లో ఎమ్మెల్సీ కవిత దీక్ష చేప‌ట్టారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చిన తర్వాత 33శాతం రిజర్వేషన్‌ను పెంచుకున్నామన్నారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లక్షకు పైగా ఉద్యోగాలు మ‌హిళ‌ల‌కు ఇచ్చామ‌ని చెప్పారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల విషయంలో మాట తప్పిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వ్యక్తిగతంగా చనిపోయిన ఆడబిడ్డలను అడ్డుపెట్టుకుని రేవంత్‌ రెడ్డి రాజకీయం చేశార‌ని విమర్శించారు. ఓటుకు నోటు కేసులో దొరికిన వ్యక్తి మహిళల ఉద్యోగాల విషయంలో కోత విధించారన్నారు. వికలాంగులు, మహిళలకు తోడు ఉండకుండా ఎవరికి తోడు ఉంటున్నారో చెప్పాలని రేవంత్ ను నిల‌దీశారు క‌విత‌. మహిళలకు 33శాతం రిజర్వేషన్‌ కల్పించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

మహిళలను కాస్త ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారని చెప్పారు. ఆడబిడ్డలకు అన్యాయం జరిగే ఏ ఒక్క కార్యక్రమం బీఆర్‌ఎస్‌ చేయలేదని వెల్లడించారు. అదే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆడపిల్లలకు వ్యతిరేకంగా జీవో 3 తెచ్చిందని విమర్శించారు. ఈ జీవో వల్ల ఉద్యోగాల్లో అమ్మాయిలకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వం వెంటనే ఈ జీవోను రద్దుచేసి, హైకోర్టులు పిటిషన్‌ వేయాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళా వ్యతిరేక విధానాలతో ముందుకువెళ్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజలకు వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకున్నా నిలదీస్తామని స్పష్టం చేశారు. జీవో 3 వల్ల గురుకులాల్లో మహిళలకు 12 శాతం ఉద్యోగాలే వచ్చాయన్నారు. తనకే అన్ని చట్టాలు తెలుసున్నట్టు సీఎం రేవంత్‌ వ్యవహరిస్తారని చెప్పారు. మహిళలకు 33 శాతం ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాజీవ్‌ గాంధీ విగ్రహం పెడుతున్నారని గ‌ళ‌మెత్తారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement