Thursday, April 25, 2024

దాహార్తి తీర్చండి మహా ప్రభో !

భీంపూర్, ప్ర‌భ న్యూస్ : ప్రతి గ్రామానికి మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వ పాలకులు ఈ గ్రామాన్ని చూస్తే ఏమంటారో మరి చూడాలి. భీంపూర్‌ మండలంలోని కరంజి టీ గ్రామ పంచాయతీ పరిధిలో గల మారుమూల గ్రామం రాజుల వాడి. ఈ గ్రామానికి కనీసం రోడ్ సౌకర్యం లేదు, తాగు నీటి స‌ర‌ఫ‌రా కూడా లేదు. మిషన్ భగీరథ ద్వారా నీళ్లు అందిస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ గ్రామస్తులు మాత్రం తమ గ్రామానికి తాగు నీళ్లు వస్తలేదని మిషన్ భగీరథ నీళ్లు ఎప్పుడో ఒకసారి తప్ప అసలు నీళ్లు రావని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామంలోని బావిలో మోటర్ వేసుకొని ఊరిలో ఉన్న ట్యాంక్ లో నింపుకొని నీళ్లను తీసుకెళ్లే పరిస్థితి ఉందన్నారు.

ఊరిలో ఉన్న ఒక్క బావిలోనీ నీళ్లు కూడా కాసేపటికి అడుగంటి పోతాయని.. మళ్లీ బావిలో నీళ్లు రావడానికి సుమారుగా 7 నుంచి 8 గంటలు వేచి చూడాల్సి వస్తుందన్నారు. గ్రామంలో నీటి వసతి లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, స్థానిక నాయకులు, అధికారులకు ఎంత మొర పెట్టుకున్నా తమ గ్రామ సమస్యలు మాత్రం పరిష్కరించ‌డం లేద‌ని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే బావిలోని నీరు తాగడానికి వాడుకోవడానికి ఉపయోగిస్తున్నామని, కనీసం బావిలో బీచింగ్ పౌడర్ వేసి క్లోరింగ్ చేసే పద్ధతి కూడా చేయడం లేదని తమ ఆరోగ్యం పట్ల ఎలాంటి జాగ్రత్తలు లేకుండా పోయాయని గ్రామస్తులు చెబుతున్నారు. సాగునీటి తాగునీటి కష్టాలు దూరమయ్యాయని రాష్ట్ర ప్రభుత్వం సంబరాలు జరుపుకుంటున్న వేళ ఇలాంటి కథనాలు బయటకి రావడంతో పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement